ప్రతిష్టాత్మక పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PMIS) ప్రారంభం వాయిదా వేయబడింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA)లోని రెండు వర్గాలు పైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌కి ఈ విషయాన్ని ధృవీకరించాయి. ప్రణాళిక ప్రకారం.. మొదటి బ్యాచ్ లబ్దిదారులకు 12 నెలల వ్యవధితో ఈ పథకం నేటి (డిసెంబర్ 2) నుండి ప్రారంభం కావాల్సి ఉంది. “కొత్త తేదీ ఇంకా నిర్ణయించబడలేదు. కానీ ఈ పథకానికి మంచి స్పందన లభించింది” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఎంసీఏ అధికారి తెలిపారు. వాయిదాకు గల కారణాన్ని సదరు అధికారి వివరించలేదు.
పీఎం ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.5000, వన్‌టైమ్ గ్రాంట్ కింద రూ.6000 వేలు ఇచ్చే కార్యక్రమం పలు కారణాల వల్ల వాయిదా పడింది. నవంబర్ 30 లోగా ఇంటర్న్‌షిప్‌లో జాయిన్ అయిన వారు ఈ పథకానికి అర్హులు. దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కోసం లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. పథకం ప్రారంభం ఆలస్యం కావడంతో అభ్యర్థులకు అంధకారం నెలకొంది. ఎంసీఏ నుండి తాజా డేటా ప్రకారం.. PMIS యొక్క పైలట్ ప్రాజెక్ట్ పథకంలో భాగస్వామ్యమైన 280 కంపెనీలు అందించే 1.27 లక్షల అవకాశాల కోసం 6.5 లక్షల దరఖాస్తులను అందుకుంది.