మహిళల కోసం ప్రత్యేక పథకం.. పూర్తి వివరాలు ఇవే
మహిళలను ప్రోత్సహించడానికి, వారికి ఆర్థిక మద్దతు కల్పించడానికి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది.
By అంజి Published on 2 Sep 2024 4:38 AM GMTమహిళల కోసం ప్రత్యేక పథకం.. పూర్తి వివరాలు ఇవే
మహిళలను ప్రోత్సహించడానికి, వారికి ఆర్థిక మద్దతు కల్పించడానికి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది. అందులో సుకన్య సమృద్ధి యోజన మంచి ఆదరణ పొందింది. అయితే ఆ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలు పెట్టుబడి పెట్టడానికి వీలు ఉండదు. దీంతో అలాంటి మహిళల కోసం గతేడాది బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్‌ఎస్‌సీఎస్)అనే పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని షార్ట్ టర్మ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌గా కూడా చెప్పుకోవచ్చు.
ఈ పథకంలో రూ.1000 నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది సింగిల్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కాబట్టి పెట్టుబడి పెట్టాలనుకున్న మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పొదుపు అనంతరం రెండేళ్ల వరకు ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలు ఉండదు. భారతదేశ పౌరసత్వం ఉన్న ఏ మహిళైనా ఈ పథకంలో నేరుగా చేరవచ్చు. మైనర్ బాలికకు గార్డియన్‌గా ఖాతా తెరిచే అవకాశం కూడా ఉంటుంది.
మీ సమీపంలోని బ్యాంకు లేదా పోస్టాఫీసును సంప్రదిస్తే.. మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన అనే ఫారం ఇస్తారు. అందులో మీ వ్యక్తిగత, ఆర్థిక, నామినేషన్ వివరాలను అందించి.. మిగతా సమాచారాన్ని కూడా ఫిల్ చేసి దరఖాస్తు పూర్తి చేయాలి. గుర్తింపు చిరునామా ప్రూఫ్ కోసం అవసరమై పత్రాలను కూడా సమర్పించాలి. ఎంచుకున్న డిపాజిట్ మొత్తాన్ని నగదు లేదా చెక్ రూపంలో వారికి డిపాజిట్ చేయాలి. పెట్టుబడికి రుజువుగా మీకో సర్టిఫికెట్ ఇస్తారు. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే విత్‌డ్రా సమయంలో ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం ఎంఎస్‌ఎస్‌సీఎస్ వడ్డీరేటు 7.5 శాతంగా ఉంది. రెండేళ్ల వ్యవధితో గరిష్ఠ పరిమితి రూ.2 లక్షలతో పెట్టుబడి పెడితే.. మొదటి ఏడాదికి రూ.15000 వడ్డీ వస్తుంది. రెండో ఏడాది రూ.2.15 లక్షలకు మళ్లీ 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే రెండో సంవత్సరం రూ.16,125 వస్తాయి. దీంతో కాలవ్యవధి పూర్తయ్యేవరకు మొత్తంగా రూ.31,125 వడ్డీ వస్తుంది. ఇది ప్రభుత్వ మద్ధతు ఉన్న పొదుపు మార్గం కాబట్టి.. ఎలాంటి రిస్క్ ఉండదు. అసలు, వడ్డీకి భద్రత ఉంటుంది. నష్టభయం ఉండదు.