రానున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో భాగంగా ఆరోగ్య బీమా, టర్మ్ జీవిత బీమా పాలసీలపై జీఎస్‌టీని తొలగించనున్నట్టు సమాచారం. జీఎస్‌టీ కౌన్సిల్ మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల దీని గురించి ఓ సమావేశం జరిపింది. ఇందులో మెజార్టీ సభ్యులు సామాన్యులకు మేలు జరిగేలా, పాలసీదార్లకు ఊరట కలిగించేలా ఇన్సూరెన్స్‌పై జీఎస్‌టీ రద్దుని సమర్థించారు. సాధారణ వ్యక్తులు తీసుకునే రూ.5 లక్షల లోపు ఆరోగ్య బీమా పాలసీలపై ఈ మినహాయింపు ఉండనుంది.
రూ.5 లక్షలు దాటిన పాలసీలకు ప్రస్తుతం ఉన్నట్టుగానే 18 శాతం జీఎస్‌టీ కొనసాగనుంది. వీటితో పాటు రూ.10 వేల ధర లోపు సైకిళ్లపై, ఓటు పుస్తకాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీని 12 శాతం నుంచి 5 శాతంకు తగ్గించాలని ప్రతిపాదనలు వచ్చాయి. 20 లీటర్లకు మించి ప్యాకేజ్డ్ తాగునీటిపై ఉన్న జీఎస్‌టీని కూడా 18 శాతం నుంచి 5 శాతం వరకు తగ్గించాలని అనుకుంటున్నారట. వీటి వల్ల గండిపడనున్న ఆదాయాన్ని పూడ్చుకోవడానికి కొన్ని లగ్జరీ ఉత్పత్తులపై జీఎస్‌టీని 18 శాతం నుంచి 28 శాతంకు పెంచనున్నారు.