ఓన్లీ 'ట్యాక్స్ ఇయర్'..నేడు పార్లమెంట్ ముందుకు కొత్త ఇన్ కం ట్యాక్స్ బిల్లు
కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్‌లో నూతన ఇన్ కం ట్యాక్స్ బిల్లు -2025 బిల్లును ప్రవేశపెట్టనుంది.
By Knakam Karthik Published on 13 Feb 2025 7:52 AM IST
ఓన్లీ 'ట్యాక్స్ ఇయర్'..నేడు పార్లమెంట్ ముందుకు కొత్త ఇన్ కం ట్యాక్స్ బిల్లు
కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్‌లో నూతన ఇన్ కం ట్యాక్స్ బిల్లు -2025 బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇన్‌కం ట్యాక్స్ కొత్త బిల్లుకు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పాత చట్టంలోని ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అనేవి ఉండేవి. ఇక నుంచి ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ బిల్లు ద్వారా పన్ను చట్టాల భాషను సరళీకృతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ తర్వాత దీనిని పార్లమెంట్ ఆర్థిక స్థాయి సంఘానికి పంపుతారు. ఇది ప్రస్తుత పన్ను స్లాబ్‌లను మార్చడు, పన్ను రీబేట్స్‌ని సమీక్షించదు. పన్నుల భాషను సరళీకరించడం వల్ల చట్టాలు సంక్షిప్తంగా, స్పష్టంగా మరియు సులభంగా అర్థం చేసుకోగలదని..ఇది వివాదాలు, వ్యాజ్యాలను తగ్గిస్తుందని, పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ పన్ను ఖచ్చితత్వాన్ని అందిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సమీక్షను పర్యవేక్షించడానికి CBDT ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే, ఆరు దశాబ్దాల నాటి చట్టాన్ని భర్తీ చేసే ప్రతిపాదిత బిల్లులోని వివిధ అంశాలను సమీక్షించడానికి 22 ప్రత్యేక ఉప కమిటీలను ఏర్పాటు చేశారు. బిల్లును రూపొందించే ముందు ప్రభుత్వం భాష సరళీకరణ, వ్యాజ్యాల తగ్గింపు, సమ్మతి తగ్గింపు, అనవసరమైన/వాడుకలో లేని నిబంధనలు అనే నాలుగు వర్గాలపై అభిప్రాయాలను ప్రజల నుంచి కోరారు. ఈ చట్టాన్ని సమీక్షించడంపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కి వాటాదారుల నుంచి 6500 సూచనలు అందాయి.
60 ఏళ్ల నాటి ప్రస్తుత చట్టంలో 880 పేజీలు, 298 సెక్షన్లు, 14 షెడ్యూళ్లు ఉండగా.. కొత్త బిల్లులో 622 పేజీల్లో 526 సెక్షన్లు, 23 చాప్టర్లు, 16 షెడ్యూళ్లు ఉంటాయి. పార్లమెంటు, స్థాయీ సంఘం ఆమోదం పొందాక 2026 ఏప్రిల్ 1 నుంచి నూతన చట్టం అమల్లోకి రానుంది. చిన్న చిన్న వాక్యాలు, టేబుళ్లు, ఫార్ములాలతో సులభంగా చదవగలిగేలా, అర్థం చేసుకునేలా తీసుకొస్తున్నారు. ఇందుకోసం ‘ఎక్స్‌ప్లనేషన్స్’ తొలగిస్తున్నారు.