18వ లోక్‌సభ కూర్పుకై కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యుల (ఎంపీలు) సమగ్ర జాబితాను సమర్పించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధులు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవనున్నారు. ఆ తర్వాత అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానిస్తారు.
ఇదిలావుంటే.. కేంద్ర మంత్రివర్గం సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం 17వ లోక్‌సభను రద్దు చేశారు. “రాష్ట్రపతి జూన్ 5, 2024న కేబినెట్ సలహాను ఆమోదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85లోని సబ్ క్లాజ్ (2) ద్వారా రాష్ట్రపతికి అందించబడిన అధికారాలతో 17వ లోక్‌సభను రద్దు చేస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు” అని రాష్ట్రపతి భవన్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా.. బుధవారం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) మూడోసారి తమ నాయకుడిగా నరేంద్ర మోదీని ఎన్నుకోవాలని తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో బుధవారం జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత దశాబ్ద కాలంగా ప్రధాని మోదీ నాయకత్వం, ఆయన మార్గదర్శకత్వంలో దేశం సాధించిన ప్రగతిపై ఎన్డీఏ నేతలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
నిన్ననే ప్రధాని మోదీ తన మంత్రి మండలితో కలిసి అధ్యక్షుడు ముర్ముకు తన రాజీనామాను కూడా సమర్పించారు. రాష్ట్రపతి ప్రధాని రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు ప్రధానమంత్రిని.. ఆయన మంత్రిమండలిని కొనసాగాలని రాష్ట్రపతి వారిని అభ్యర్థించారు.
2024 లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరిగింది. భారత ఎన్నికల సంఘం ప్రకారం.. BJP 240 సీట్లు గెలుచుకుంది. 2019లో 303 సీట్లు రాగా.. ఈ సారి తగ్గాయి. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి స్వంతంగా మెజారిటీని సాధించలేకపోయింది.
మరోవైపు కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకుని బలమైన వృద్ధిని సాధించింది. ఇండియా కూటమి 230 మార్కును దాటి.. ఎన్డీఏకు గట్టి పోటీని ఇచ్చింది.