ఢిల్లీ లిక్కర్ స్కామ్.. మనీష్ సిసోడియాకు సమన్లు జారీ
CBI summons Manish Sisodia in Delhi liquor scam. దేశ రాజధానిలో ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై సోమవారం ఉదయం
By అంజి Published on 16 Oct 2022 2:20 PM ISTదేశ రాజధానిలో ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రశ్నించేందుకు సమన్లు పంపింది. ఈ వార్తను మనీష్ సిసోడియా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో.. ''నా ఇంట్లో 14 గంటల పాటు సీబీఐ దాడులు జరిగాయి. ఏమీ బయటకు రాలేదు. నా బ్యాంక్ లాకర్‌లోనూ వెతికారు. కానీ దానిలో ఏం బయట పడలేదు. వారు మా గ్రామంలో కూడా సోదాలు చేశారు. ఇప్పుడు రేపు ఉదయం 11 గంటలకు నన్ను సిబిఐ హెడ్‌క్వార్టర్స్‌కి పిలిచారు. నేను వెళ్లి పూర్తి సహకారం అందిస్తాను. సత్యమేవ జయతే." ట్వీట్ చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి ఆరోపణలపై మనీష్ సిసోడియాను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. అయితే ఆప్ నేత సిసోడియా తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేయడంతో పాటు బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా జూలైలో సిఫారసు చేయడంతో బీజేపీ-ఆప్ ప్రతిష్టంభన ఏర్పడింది. విచారణకు సిఫార్సు చేసిన తర్వాత, ఢిల్లీ ప్రభుత్వం తన మద్యం పాలసీని ఉపసంహరించుకోవలసి వచ్చింది. ప్రైవేట్ కంపెనీలను తిరిగి మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో దేశవ్యాప్తంగా సీబీఐలో చాలా మంది ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లిని కూడా ఏజెన్సీ అరెస్టు చేసింది.
ఢిల్లీ మద్యం కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ రెండూ విచారిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో, ఈ కేసుకు సంబంధించి ఈడీ 25 కంటే ఎక్కువ ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. మద్యం వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తల స్థలాలను కూడా సోదా చేసింది. పంజాబ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లోని 35కి పైగా ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. మద్యం వ్యాపారుల లాబీయింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ కేసులో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి అనే కంపెనీ డైరెక్టర్ అభిషేక్ బోయిన్‌పల్లిని అక్టోబర్ 10న సిబిఐ అరెస్టు చేసింది. గత నెలలో ఈ కేసులో ఆప్ కమ్యూనికేషన్స్ చీఫ్, సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.