ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు

CBI raids Delhi Deputy CM Manish Sisodia's residence.ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Aug 2022 10:51 AM IST
ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు

ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా నివాసంపై సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్‌(సీబీఐ) శుక్ర‌వారం దాడులు నిర్వ‌హించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ దాడులు నిర్వ‌హించింది. సిసోడియా నివాసంతో పాటు ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జ‌రిగాయి.

త‌న ఇంటిపై సీబీఐ దాడుల‌ను మ‌నీష్ సిసోడియా ధ్రువీక‌రించారు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తున్నాని, అదే స‌మ‌యంలో విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తాయ‌ని ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశారు. "సీబీఐ వ‌చ్చింది. వారిని స్వాగ‌తిస్తున్నాం. మేము చాలా నిజాయితీగా ఉన్నాం. ద‌ర్యాప్తున‌కు పూర్తిగా స‌హ‌కారం ఇస్తాం. అప్పుడే నిజాలు త్వ‌ర‌గా బ‌య‌ట‌కు వ‌స్తాయి. అప్ప‌టి దాకా నా మీద ఎన్నికేసులు పెట్టినా ఏమీ కాదు. ఉత్త‌మ విద్య కోసం నేను చేస్తున్న కృషిని ఎవ్వ‌రూ ఆప‌లేరు. ల‌క్ష‌లాది మంది పిల్ల‌ల భ‌విష్య‌త్తును తీర్చిదిద్దుతున్నాం. మ‌న‌దేశంలో మంచి ప‌నులు చేసే వారిని ఇలా వేదించ‌డం చాలా దురదృష్ట‌క‌రం. అందుక‌నే మ‌న దేశం ఇంకా నంబ‌ర్‌-1గా మార‌లేదు." అని ట్వీట్‌చేశారు.

కొంత మంది కావాల‌నే ఢిల్లీలో విద్య‌, వైద్య శాఖ‌ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు. ఈ రంగాల్లో జ‌రుగుతోన్న మంచిని ఆపాల‌నే ఉద్దేశ్యంతోనే త‌మ‌పై అరెస్టుకు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. అవ‌న్నీ త‌ప్పుడు ఆరోప‌ణ‌న‌లు అని, త్వ‌ర‌లోనే నిజాల‌న్నీ న్యాయ‌స్థానంలో బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని తెలిపారు.

సీబీఐ సోదాలపై ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ స్పందించారు. "అమెరికాలోని ప్ర‌ముఖ వార్తాప‌త్రిక అయిన న్యూయార్క్ టైమ్స్‌లో ఈ రోజే ఢిల్లి ఎడ్యుకేష‌న్ మోడ‌ల్‌ను అభినందిస్తూ మొద‌టిపేజీలో క‌థ‌నం వ‌చ్చింది. మ‌నీశ్ సిసోడియా ఫోటోల‌ను కూడా ప్ర‌చురించారు. ఇదే రోజు ఆయ‌న ఇంట్లో సీబీఐ సోదాలు జ‌రుగుతున్నాయి. మంచి ప‌నికి ల‌భించిన ఫ‌లిత‌మిది. అయినా.. మేం సీబీఐకి స్వాగ‌తం ప‌లుకున్నాం.మేము పూర్తి సహకారం అందిస్తాము. గతంలో కూడా సోదాలు దాడులు జరిగాయి, కానీ ఏమీ కనుగొనబడలేదు. ఇప్పుడు కూడా మీకు ఏదీ దొరకదు "అంటూ ట్వీట్ చేశారు.

Next Story