రూ.228 కోట్ల మోసం.. అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తనయుడు జై అన్మోల్ కు కష్టాలు పెరిగిపోయాయి.

By -  Medi Samrat
Published on : 9 Dec 2025 5:03 PM IST

రూ.228 కోట్ల మోసం.. అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తనయుడు జై అన్మోల్ కు కష్టాలు పెరిగిపోయాయి. ఆయనపై సీబీఐ మోసం కేసు నమోదు చేసింది. జై అన్మోల్ రూ.228 కోట్ల మోసానికి పాల్పడ్డారు. ఈ మేర‌కు జై అన్మోల్ సహా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL)పై సీబీఐ కేసు నమోదు చేసింది. జై అన్మోల్, అతని కంపెనీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేశాయని సీబీఐ ఆరోపించింది. దీనివల్ల బ్యాంకుకు రూ.228 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్ల‌డించింది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై సీబీఐకి ఫిర్యాదు చేయగా.. సీబీఐ ఈ విషయాన్ని గుర్తించింది. RHFL డైరెక్టర్లు జై అన్మోల్, రవీంద్ర శరద్ సుధాకర్ ఇద్దరి పేర్లు ఈ కేసులో చేర్చబడ్డాయి. సీబీఐలో నమోదైన కేసు ప్రకారం.. ఆర్ హెచ్ ఎఫ్ ఎల్ కంపెనీ బ్యాంకు నుంచి రూ.450 కోట్ల రుణం తీసుకుంది. ఈ రుణం ముంబైలోని SCF బ్రాంచ్ నుండి తీసుకుంది. రుణం ఇచ్చే సమయంలో బ్యాంకు కొన్ని షరతులను కంపెనీ ముందు ఉంచింది. అందులో రుణాన్ని సకాలంలో చెల్లించడం, సెక్యూరిటీ డిపాజిట్ చేయడం, అవసరమైన పత్రాలను సకాలంలో అందించడం వంటివి ఉన్నాయి.

కంపెనీ సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోయిందని బ్యాంకు ఆరోపిస్తోంది. సెప్టెంబర్ 20, 2019న, బ్యాంక్ దానిని NPA (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్)గా ప్రకటించింది. బ్యాంకు నుంచి తీసుకున్న డబ్బు దుర్వినియోగమైనట్లు విచారణలో తేలింది. కంపెనీ డైరెక్టర్లు డబ్బును ఇతర పనులకు ఉపయోగించి బ్యాంకును మోసం చేశారు. రుణం తీసుకున్న ప్రయోజనం కోసం డబ్బును పెట్టుబడి పెట్టకుండా, డబ్బును ఇతర విషయాలలో పెట్టుబడి పెట్టారు.. ఇది నేరం అని బ్యాంకు ఆరోపిస్తోంది.

Next Story