మనకు చాక్లెట్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది క్యాడ్బరీ చాక్లెట్ గుర్తుకు వస్తుంది. దీనికి సంబంధించిన యాడ్స్ కూడా చూడ ముచ్చటగా ఉంటాయి. స్నేహితులకు, శుభ కార్యాలకు కూడా క్యాడ్బరీ చాక్లెట్లు గిఫ్ట్ గా ఇస్తుంటారు. తాజాగా ప్రముఖ చాక్లెట్ సంస్థ క్యాడ్బరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని బడ్డిలో ప్రాంత ఆధారిత పన్ను ప్రయోజనాలను పొందేందుకు వాస్తవాలను తప్పుగా చూపి అవినీతికి పాల్పడిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
ప్రస్తుతం మోండెలెజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా పేరుమార్చుకున్న క్యాడ్బరీ ఇండియా.. పన్ను ప్రయోజనాలు పొందటానికి అధికారులకు లంచాలు, తప్పుడు సమాచారం అందించిందని తెలిపింది. కేంద్ర ఎక్జైజ్, ఆదాయ పన్ను నుంచి మినాహాయింపు పొందే అర్హత తమకు లేదని తెలిసినప్పటికీ.. క్యాడ్బరీ మోసపూరితంగా వ్యవహరించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది.
క్యాడ్బరీ కార్యనిర్వాహక బోర్డులోని కొంత మంది సభ్యులు , కీలక వ్యక్తులు, మెనేజర్లు సమష్టిగా అంతర్గత దర్యాప్తులో బయటపడిన అన్ని ఆధారాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని సీబీఐ ఆరోపించింది. అయితే.. దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసుకు సంబంధించి అధికారుల నుంచి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం తమకు అందలేదని మోండెలెజ్ ఇండియా ప్రతిధి తెలిపారు.