న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ తనను దాదాపు 56 ప్రశ్నలు అడిగారని, వాటన్నింటికీ తాను సమాధానమిచ్చానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తెలిపారు. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆదివారం ఆయనను దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. "ఎక్సైజ్ పాలసీ కేసు మొత్తం అబద్ధమని నేను చెప్పదలుచుకున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ తప్పు చేశారనడానికి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇది మురికి రాజకీయాల ఫలితమే" అని సీఎం కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు.
"ఆతిథ్యం" అందించినందుకు సీబీఐ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. "వారు నన్ను స్నేహపూర్వకంగా, సామరస్యపూర్వకంగా ప్రశ్నలు అడిగారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్పాను" అని కేజ్రీవాల్ అన్నారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సీబీఐ దాదాపు 56 ప్రశ్నలను అడిగిందని, పాలసీని ఎప్పుడు, ఎందుకు ప్రారంభం గురించి తెలిపానని చెప్పారు. తన అధికారిక బ్లాక్ ఎస్‌యూవీలో ఉదయం 11 గంటలకు భారీ బందోబస్తు మధ్య ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆప్ చీఫ్ కేజ్రీవాల్.. అవినీతి నిరోధక శాఖ మొదటి అంతస్తు కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ దర్యాప్తు బృందం అతనిని ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు.