ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌.. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది.

By Medi Samrat  Published on  26 Jun 2024 2:14 PM IST
ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌.. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఇక్కడి నుంచి కోర్టు అనుమతి తర్వాత అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. కోర్టు విచారణ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్ పడిపోయింది. ఆ తర్వాత టీ, బిస్కెట్లు తినిపించేందుకు కోర్టు గది నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో కేజ్రీవాల్‌తో పాటు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా ఉన్నారు.

CBI అరెస్టు చేసిన తర్వాత కేజ్రీవాల్.. రోస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఆర్డర్‌పై స్టే విధించిన హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

సీబీఐ అరెస్ట్‌పై కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది ప్రశ్నలు సంధిస్తూ.. సీబీఐ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని అన్నారు. గతేడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను సీబీఐ తొమ్మిది గంటలపాటు విచారించినందున సీబీఐ అరెస్టు నిర్ణయంపై కేజ్రీవాల్ తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు.

అంతకుముందు సీబీఐ మంగళవారం తీహార్ జైలుకు చేరుకుని సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సుమారు మూడు గంటల పాటు విస్తృతంగా విచారించింది. గోవా ఎన్నికల్లో వినియోగించిన డ‌బ్బు సహా 50కి పైగా ప్రశ్నలు అడిగారు. 10 మంది సభ్యులతో కూడిన సీబీఐ బృందం ఉదయం తీహార్ జైలుకు చేరుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చాలా ప్రశ్నలకు కేజ్రీవాల్ స్పష్టంగా సమాధానం చెప్పలేకపోయార‌ని స‌మాచారం.

Next Story