భారతదేశంలో గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! భారతదేశంలో జూన్ నెల ఆరంభం నుంచి కరోనా కేసుల్లో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. జులై నెలాఖరుకు కరోనా నాలుగో వేవ్ రావొచ్చంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3.44 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 8,329 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 2.41 శాతంగా ఉంది. అదే సమయంలో కరోనా నుంచి 4,216 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 10 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ వస్తుందేమో అనే భయం వెంటాడుతూ ఉంది. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కోరారు. రోజు వారీ కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కొత్త వేరియంట్ లక్షణాలు సోకిన వ్యక్తుల నమూనాలను పంపాలని కేరళ, తమిళనాడు,కర్ణాటక,తెలంగాణ, మహారాష్ట్రలను కోరారు.
కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తోందనే కథనాలపై ఐసీఎంఆర్ ఏడీజీ (అడ్మినిస్ట్రేటివ్ సెటప్ డైరెక్టర్) సమీరన్ పాండా స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని జిల్లాలలో కేసులు పెరుగుతూ ఉండటాన్ని దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకోలేమని అన్నారు. దేశంలో కనిపించే రూపాంతరం చెందిన ప్రతి వైరస్ ఆందోళన కలిగించేది కాదని అన్నారు. దేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ మునుపటి లాగా ప్రమాదకరంగా మారే పరిస్ధితి లేదని మరికొందరు నిపుణులు అంటున్నారు.