రాష్ట్రపతి నిజంగా ప్రధానితో రాజీనామా చేయించగలరా.? : ఒవైసీ

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లులపై ప్రశ్నలు లేవనెత్తారు.

By Medi Samrat
Published on : 25 Aug 2025 6:01 PM IST

రాష్ట్రపతి నిజంగా ప్రధానితో రాజీనామా చేయించగలరా.? : ఒవైసీ

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లులపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ బిల్లుల్లో ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులను తొలగించే నిబంధన పెట్టారు. రాష్ట్రపతి ప్రధానిని నిజంగా తొల‌గించ‌వచ్చా అని ఒవైసీ ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం.. రాష్ట్రపతి మంత్రి మండలి సలహా మేరకు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. కానీ ఈ ప్రతిపాదిత బిల్లులో రాష్ట్రపతి ప్రధానిని తొలగించవచ్చని రాసి ఉంది.. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు.

ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి వంటి అగ్రనేత ఏదైనా తీవ్రమైన నేరంలో పట్టుబడి, వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే, ఆ పదవి నుంచి తొలగిస్తామని అందులో పేర్కొన్నారు. ఈ నిబంధనను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఒవైసీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కోరుకుంటే కొందరు మంత్రులను అరెస్టు చేయడం ద్వారా ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా కూలదోయవచ్చని అన్నారు.

ఒక రాష్ట్ర ప్రభుత్వంలోని నలుగురైదుగురు మంత్రులను కేంద్రం అరెస్టు చేస్తే ఆటోమేటిక్‌గా ప్రభుత్వం పడిపోతుంది.. ఇక స్వేచ్ఛ ఎక్కడ మిగులుతుంది.. నిజానికి పూర్తి నియంత్రణ కేంద్రం చేతుల్లోకి వస్తుందని అన్నారు.

గత వారం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కూడా ఒవైసీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రభుత్వం 'పోలీస్ రాజ్యం' సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఈ బిల్లు ప్రజాప్రతినిధుల హక్కులను హరిస్తుందని, ప్రజాస్వామ్య పునాదులను కదిలిస్తుందని అన్నారు.

ఈ చర్య ఎన్నికైన ప్రభుత్వంపై దాడి లాంటిదని ఒవైసీ అన్నారు. ఈ చట్టం వల్ల మూడు అధికార స్తంభాలైన శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల స్వాతంత్ర్యం బలహీనపడుతుందని, ప్రజల ఓటింగ్ ప్రాధాన్యత కూడా తగ్గుతుందని ఆయన వాదన.

Next Story