ఢిల్లీ లిక్క‌ర్‌ పాలసీ.. ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం : కాగ్‌

ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వ ఖజానాకు 2026 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్‌ నివేదిక తెలిపింది.

By Medi Samrat  Published on  11 Jan 2025 8:04 PM IST
ఢిల్లీ లిక్క‌ర్‌ పాలసీ.. ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం : కాగ్‌

ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వ ఖజానాకు 2026 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్‌ నివేదిక తెలిపిన‌ట్లుగా జాతీయ మీడియా క‌థ‌నాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో మద్యం వ్యాపారం నష్టాల్లో ఉన్నప్పటికీ ఆప్‌ ప్రభుత్వం కొంతమంది బిడ్డర్లకు లైసెన్సులు జారీ చేసిందని కాగ్‌ నివేదిక వెల్లడించిదని నివేదికల సారాంశం. ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల కారణంగా సర్కారుకు భారీ నష్టం వచ్చిందని కాగ్ వెల్లడించింది. మాజీ మనీష్ సిసోడియాతో పాటు ఇతర మంత్రుల బృందం, నిపుణుల ప్యానెల్ సిఫార్సులను విస్మరించిందని నివేదిక తెలిపింది. మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ నిబంధనలు కూడా ఉల్లంఘించారని తెలిపింది.

ఎక్సైజ్‌ పాలసీ అమలులో పలు కీలక నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారని నివేదిక పేర్కొంది. మద్యం విధానాన్ని రూపొందించే ముందు నిపుణులను సంప్రదించారు. కానీ వారి సిఫార్సులను పాటించలేదని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. ఫిర్యాదులు ఎదుర్కొంటున్న, నష్టాల్లో నడుస్తున్న కంపెనీలకు కూడా లైసెన్సులు జారీ చేశారు. అనేక నిర్ణయాలలో క్యాబినెట్, లెఫ్టినెంట్ గవర్నర్ నుండి ఆమోదం తీసుకోలేదని, మద్యం ధర నిర్ణయించడంలోనూ, లైసెన్సులు జారీ చేయడంలో పారదర్శకత లోపించిందని కాగ్ అభిప్రాయపడింది.

Next Story