అహ్మదాబాద్‌లో '2030 కామన్వెల్త్ క్రీడలు'..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

కామన్వెల్త్ క్రీడలు-2030 (సీడబ్ల్యూజీ) వేలంలో పాల్గొనేందుకు బిడ్ సమర్పించాలన్న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదించింది

By Knakam Karthik
Published on : 28 Aug 2025 11:55 AM IST

National News, Delhi, Union Cabinet, Commonwealth Games 2030,

అహ్మదాబాద్‌లో '2030 కామన్వెల్త్ క్రీడలు'..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

కామన్వెల్త్ క్రీడలు-2030 (సీడబ్ల్యూజీ) వేలంలో పాల్గొనేందుకు బిడ్ సమర్పించాలన్న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదించింది. బిడ్ ఆమోదం పొందినట్లయితే.. సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అధికారుల నుంచి అవసరమైన హామీలతో పాటు ఆతిథ్య సహకార ఒప్పందంపై (హెచ్‌సీఏ- హోస్ట్ కొలాబొరేషన్) సంతకం చేయడానికి.. గుజరాత్ ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని (గ్రాంట్-ఇన్-ఎయిడ్‌) మంజూరు చేసేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

72 దేశాలకు చెందిన క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడలలో పాల్గొంటారు. క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడలను నియంత్రించే అధికారులు, పర్యాటకులు, క్రీడలకు సంబంధించిన మీడియా వ్యక్తులు వంటి వారు ఈ భారీ క్రీడా కార్యక్రమానికి హాజరవుతారు. ఇది స్థానిక వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. వారి ఆదాయాలను పెంచుతుంది.

ప్రపంచ స్థాయి స్టేడియంలు, అత్యాధునిక శిక్షణ సౌకర్యాలు, మంచి క్రీడా సంస్కృతిని అందించే ఆహ్మదాబాద్ ఈ క్రీడల ఆతిథ్యానికి సరైన నగరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియం.. 2023 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.

భారతదేశంలో సీడబ్ల్యూజీని నిర్వహించటం వల్ల కేవలం క్రీడలకే కాకుండా పర్యాటకం వృద్ధి చెందడం, ఉద్యోగాలను సృష్టించడంతో పాటు లక్షలాది యువ క్రీడకారులకు స్ఫూర్తినిస్తుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ సైన్స్, కార్యక్రమాల నిర్వహణ, లాజిస్టిక్స్- ట్రాన్స్‌పోర్ట్ కోఆర్డినేటర్లు, ప్రసారాలు- మీడియా, ఐటీ- కమ్యూనికేషన్లు, ప్రజా సంబంధాలు- కమ్యూనికేషన్లు తదితర రంగాల్లో కూడా పెద్ద సంఖ్యలో నిపుణులు అవకాశాలను పొందుతారు.

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల దేశ గౌరవం, ఐక్యత భావన బలపడుతుంది. భారీ కార్యక్రమాలను నిర్వహించే విషయంలో దేశానికి అనుభవాన్ని అందిస్తుంది. భారతదేశ మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది. ఇది క్రీడలను తమ జీవితంగా ఎంచుకునేందుకు నవతరం క్రీడాకారులనకు స్ఫూర్తినిస్తుంది. దీనితో పాటు అన్ని స్థాయీ క్రీడలలో ఎక్కువ భాగస్వామ్యం ఉండేలా ప్రోత్సహిస్తుంది.

Next Story