ఢిల్లీలో మరోమారు మోగిన ఎన్నికల నగారా..!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లోని 12 వార్డులకు ఉప ఎన్నికల తేదీని ప్రకటించారు.
By - Medi Samrat |
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లోని 12 వార్డులకు ఉప ఎన్నికల తేదీని ప్రకటించారు. ఢిల్లీ ఎన్నికల సంఘం మంగళవారం నాడు ఖాళీగా ఉన్న 12 మున్సిపల్ కౌన్సిలర్ల పోస్టుల భర్తీ ఉప ఎన్నికల తేదీని ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 12 వార్డులకు నవంబర్ 30న ఓటింగ్ నిర్వహించనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి.. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.
ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకారం.. నవంబర్ 3 నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ దాఖలు చేయడానికి నవంబర్ 10 చివరి తేదీ. నవంబర్ 12న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15. నవంబర్ 30న ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.
ముండ్కా, షాలిమార్ బాగ్-బి, అశోక్ విహార్, చాందినీ చౌక్, చాందినీ మహల్, ద్వారకా-బి, డిచౌన్ కలాన్, నరైనా, సంగమ్ విహార్-ఎ, దక్షిణ్ పురి, గ్రేటర్ కైలాష్, వినోద్ నగర్ వార్డుల్లో ఎంసీడీ ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గతంలో షాలిమార్ బాగ్-బి వార్డు నుంచి కౌన్సిలర్‌గా ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. అదే సమయంలో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి బిజెపి కౌన్సిలర్ కమల్‌జిత్ సెహ్రావత్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ద్వారకా-బి వార్డు ఖాళీ అయింది. ఇది కాకుండా.. ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, ఆప్‌ల సిట్టింగ్ కౌన్సిలర్లు పోటీ చేసి ఎమ్మెల్యేలుగా మారడంతో మిగిలిన వార్డులు ఖాళీ అయ్యాయి.