పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. జనవరి 29న ప్రారంభమైన ఈ సమావేశాలు.. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్. అయితే కరోనా మహమ్మారి కారణంగా రాజ్యసభ, లోక్‌సభలను వేర్వేరు సమయాల్లో సమావేశాలను నిర్వహిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే పార్లమెంట్ సమావేశాలు రెండు విడతల్లో ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నారు.
కాగా, కరోనా కారణంగా రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు జరుగుతుంది. తొలి విడత జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో విడత మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. అయితే రెండు విడతల్లో జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాల తొలి విడత నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కాకుండా 13న ముగియనుంది రాజ్యసభ. గ్రాంట్లకు సంబంధించి డిమాండ్ల పరిశీలనకు వీలుగా రాజ్యసభ సమావేశాలను కుదించారు. రెండో విడత సమావేశాలు షెడ్యూల్ ప్రకారం మార్చి 8న ప్రారంభం అవుతాయి.