తెలంగాణ మోడల్ మహారాష్ట్రలో తీసుకొస్తే నేనెందుకు ఇక్కడికి వస్తాను.? : కేసీఆర్
Brs Party Public Meeting At Aurangabad In Maharashtra. మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి మూడో బహిరంగసభ నిర్వహిస్తోన్నసంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 24 April 2023 3:45 PM GMTమహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి మూడో బహిరంగసభ నిర్వహిస్తోన్నసంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో మార్పు తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ ఏర్పడిందని అన్నారు. మార్పు వచ్చే వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందన్నారు. మార్పు రాకుంటే దేశం ముందుకు వెళ్లదని.. మార్పును తీసుకు వచ్చేందుకే బీఆర్ఎస్ పుట్టిందని పేర్కొన్నారు. తెలంగాణలో మంచినీటి సమస్య లేకుండా చేశామన్న కేసీఆర్.. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని వివరించారు.
తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు పావుగంటలో అవుతున్నాయి. రైతులకు సాగునీరు, ఎరువులు సకాలంలో అందేలా ఏర్పాట్లు చేశాం. తెలంగాణలో ప్రతీ ఎకరానికి రూ. 10 వేలు రైతుబంధు ఇస్తున్నాం. రైతు చనిపోతే బీమా కల్పిస్తున్నాం. మరి మహారాష్ట్రలో ఇవి ఎందుకు అమలు కావడం లేదని.. ఇంకెంతకాలం పరిష్కారం కోసం ఎదురుచూడాలని ప్రశ్నించారు. ఈ సమస్యలను మనమే పరిష్కరించుకోవాలన్నారు. కేసీఆర్‌కు మహారాష్ట్రలో ఏం పని అని ఫడ్నవీస్ అంటున్నారు. తెలంగాణ లాంటి మోడల్ మహారాష్ట్రలో తీసుకొస్తే నేనెందుకు వస్తాను. మహారాష్ట్రలో దళితబంధు, రైతుబంధు అమలు చేయ్.. 24 గంటల కరెంట్ ఇవ్వండి. రైతుబంధు, రైతుబీమా కల్పించండి. ఇవన్నీ అమలు చేస్తే మహారాష్ట్రకు రానే రాను. అంబేద్కర్ జన్మించిన నేలపై దళితులను పట్టించుకోరా..? అని ఫైర్ అయ్యారు. నూతనంగా నిర్మించే పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రజలు తాగేనీటినే.. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ, గోండు ప్రజలు కూడా తాగుతున్నారని తెలిపారు. గోదావరి, కృష్ణా, పెన్ గంగా వంటి నదులు ఉన్నా మహారాష్ట్రకు నీటి కష్టాలెందుకు..? ముంబై దేశ ఆర్థిక రాజధాని, కానీ తాగేందుకు నీళ్లుండవా..? దేశం పురోగమిస్తుందా..? తిరోగమిస్తుందా..? ఆలోచించండి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయింది.. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని అన్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడ కూడా ఇంటింటికీ నీళ్లు ఇచ్చి తీరుతామని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడంతో పాటు.. ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కావాల్సిన దాని కంటే రెట్టింపు నీరు పుష్కలంగా ఉన్నా.. తాగేందుకు నీరు లేదని అన్నారు.