Maharashtra: 12 జెడ్పీ స్థానాల గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్
హైదరాబాద్: తెలంగాణ పక్కరాష్ట్రంలో జరిగే ఎన్నికల రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టాలని భారత రాష్ట్ర సమితి
By అంజి Published on 4 April 2023 5:45 AM GMTMaharashtra: 12 జెడ్పీ స్థానాల గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్
తెలంగాణ పక్కరాష్ట్రంలో జరిగే ఎన్నికల రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోని 34 జిల్లా పరిషత్‌లలో కనీసం 12 స్థానాల్లోనైనా విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని కంధర్ లోహాలో ఇటీవల జరిగిన సభతో సహా, ఇప్పటికే రెండు బహిరంగ సభలను నిర్వహించిన తర్వాత విదర్భలో మూడవ బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నారు.
మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల "తెలంగాణ మోడల్"పై దూకుడుగా ప్రచారం నిర్వహించాలని రావు మహారాష్ట్ర పార్టీ నాయకులను ఆదేశించారు. మహారాష్ట్రలోని వివిధ పార్టీలకు చెందిన మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్ ఎంపిక చేసిన నాయకులతో రోజూ టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారని, 2024 అక్టోబర్‌లో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించి మహారాష్ట్రలో కార్యకలాపాలను వేగవంతం చేయడంపై వారికి ఆదేశాలు ఇస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.
ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రపైనే సీఎం దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతంలో ఉన్న విదర్భ ప్రాంతంలో, పశ్చిమ ప్రాంతంలోని మరో జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్.. ఇప్పుడు యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలోని ముంబై, పూణే, నాగ్‌పూర్, ఔరంగాబాద్‌లలో త్వరలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు.