వ‌ర‌ద‌నీటిలో కొట్టుకుపోయిన వంతెన‌.. వీడియో వైర‌ల్‌

Bridge Swept Away In Flood Fury In Madhya Pradesh.మ‌ధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2021 11:28 AM IST
వ‌ర‌ద‌నీటిలో కొట్టుకుపోయిన వంతెన‌.. వీడియో వైర‌ల్‌

మ‌ధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అవుతున్నాయి. న‌దుల్లో భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. భారీ వ‌ర‌ద‌ల‌కు దాతియా జిల్లాలో ఒకే న‌దిపై ఉన్న రెండు బ్రిడ్జి(వంతెన‌)లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల ధాటికి మణిఖేడ ఆనకట్ట నుండి ప్రవహిస్తున్న నీటి వేగానికి వంతెన నదిలో ఒక్కసారిగా కుప్పకూలింది. మణిఖేడ డ్యామ్ 10 గేట్లు ఎత్తడంతో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన‌ వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రిడ్జి‌ పైనుంచి వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ కాసేపటికే బ్రిడ్జి మొత్తం.. వరద నీటిలో కొట్టుకుపోయింది.

ఈ బ్రిడ్జి.. సింధు నదిపై మణిఖేదా డ్యామ్ దిగువ భాగంలో ఉంది. దాటియా నుచి రతన్‌గఢ్‌ పట్టణానికి మధ్య రాకపోకలు సాగించేందుకు వీలు కల్పిస్తోంది. బాధిత గ్రామాలను అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ వెల్లడించారు. వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వరద ప్రభావానికి గురైన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తగిన సాయం చేస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని సీఎం ట్వీట్‌ చేశారు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్ననేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం సహాయంపై ప్రధాని మోదీతో చర్చించినట్టు ఆయన వెల్లడించారు.

రతన్‌గఢ్‌లోని దుర్గా మాతా ఆలయం చాలా ప్రసిద్ది చెందినది. 2009లో ఈ బ్రిడ్జిని నిర్మించారు. అయితే 2013 అక్టోబర్‌లో నవరాత్రి ఉత్సవాల జరుగుతున్న వేళ.. ఇదే బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 115 భక్తులు మరణించారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తొక్కిసలాట అనంతరం ఈ బ్రిడ్జి మొత్తం మృతదేహాలతో క‌నిపించింది.

Next Story