విధి ఆడిన వింత నాటకం.. పెళ్లి రోజే వధువు మృతి.. అయినా ఆగని వివాహాం
మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా వధువు గుండెపోటుతో మరణించింది. దీంతో పెళ్లి సందడితో అప్పటి వరకు కలకలలాడుతున్న
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2023 8:33 AM ISTఇటీవల కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా వధువు గుండెపోటుతో మరణించింది. దీంతో పెళ్లి సందడితో అప్పటి వరకు కలకలలాడుతున్న ఆ ఇంట విషాదం నెలకొంది. అయితే.. అంతటి దుఃఖంలోనూ వధువు కుటుంబ ఓ నిర్ణయం తీసుకుంది. అందుకు వరుడి కుటుంబం అంగీకరించింది. మృతి చెందిన వధువు స్థానంలో మరో బిడ్డను పెళ్లి కూతురి స్థానంలో తల్లిదండ్రులు కూర్చోబెట్టి వివాహాన్ని జరిపించారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
భావ్‌నగర్ జిల్లాలోని సుభాశ్‌నగర్ ప్రాంతంలో జినాభాయ్ భాకాభాయ్ రాథోడ్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇతడి పెద్ద కుమార్తె హేతల్‌కు నారీ గ్రామానికి చెందిన విశాల్‌భాయ్‌తో గురువారం పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. వివాహాన్ని ఘనంగా చేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. పెళ్లికి సమయం దగ్గర పడుతుండడంతో వరుడు విశాల్ ఎంతో సంతోషంతో వధువు ఇంటికి ఊరేగింపుగా వచ్చాడు. వధువు ఇంట పెళ్లి సందడి మొదలైంది.
తాను ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచినట్లు.. ముహూర్తానికి కొన్ని గంటల ముందు వధువు హేతల్ ఒక్క సారిగా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే.. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కాసేపట్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది.
ఇంతటి విషాద సమయంలోనూ వధువు కుటుంబం ఓ నిర్ణయం తీసుకుంది. చనిపోయిన పెద్ద కుమార్తె స్థానంలో చిన్న కూతురిని ఇచ్చి పెళ్లి జరిపించాలని బావించగా.. ఇందుకు వరుడు కుటుంబం కూడా అంగీకరించింది. దీంతో హేతల్ డెడ్‌బాడీని మార్చురీలో భద్రపరిచి మరో ముహూర్తం పెట్టించి శుక్రవారం వీరి పెళ్లి చేశారు. విధి ఆడిన వింత నాటకంలో మరదలు కావాల్సిన అమ్మాయి కాస్త భార్యగా మారింది.