50కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఏం డిమాండ్ చేశారంటే..?
రాజధాని ఢిల్లీలోని 50కి పైగా పాఠశాలలకు బుధవారం మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat
రాజధాని ఢిల్లీలోని 50కి పైగా పాఠశాలలకు బుధవారం మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఈమెయిల్ ద్వారా వచ్చిన ఈ బెదిరింపులు కలకలం సృష్టించాయి. ముందుజాగ్రత్తగా పాఠశాల ఆవరణలన్నీ వెంటనే ఖాళీ చేయించారు. బాంబు బెదిరింపు సమాచారంతో డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య బృందం, ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులను ఇంటికి పంపించారు.
ఢిల్లీ పోలీసుల ప్రకారం.. 'టెర్రరిస్ట్ 111' అనే బృందం DAV పబ్లిక్ స్కూల్, ఫెయిత్ అకాడమీ, డూన్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయ, ఇతర పాఠశాలలకు $25,000 డిమాండ్ చేస్తూ ఈమెయిల్‌లు పంపింది. ఇదే బృందం ఆగస్టు 18న అనేక పాఠశాలలకు బాంబు బెదిరింపులు పంపి.. క్రిప్టోకరెన్సీలో $5,000 డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఈమెయిల్‌లో ఇలా ఉంది.. “మేము మీ IT సిస్టమ్‌లను హ్యాక్ చేశాం.. విద్యార్థి, సిబ్బంది డేటాను సేకరించాము. అన్ని భద్రతా కెమెరాలు మా ఆధీనంలో ఉన్నాయి. మేము మీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాము. 48 గంటలలోపు US$2000 Ethereum చిరునామాకు బదిలీ చేయండి.. లేదంటే మేము బాంబును పేల్చేస్తాము అని ఉంది.
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు బెదిరింపులు వచ్చాయి.
అంతకుముందు ఆగస్టు 18న ఢిల్లీలోని 32 పాఠశాలలపై బాంబులు వేస్తామని ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఇవన్నీ దక్షిణ, నైరుతి, ద్వారక జిల్లాల పాఠశాలలు. కొన్ని గంటల విచారణ తర్వాత ఈ బెదిరింపు నకిలీదని తేలింది.