టిష్యూ పేపర్‌పై ‘విమానంలో బాంబు ఉంది’ అని రాసి టాయిలెట్‌లో వేశారు.. ఆ త‌ర్వాత..

ఢిల్లీ నుంచి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.

By -  Medi Samrat
Published on : 18 Jan 2026 3:13 PM IST

టిష్యూ పేపర్‌పై ‘విమానంలో బాంబు ఉంది’ అని రాసి టాయిలెట్‌లో వేశారు.. ఆ త‌ర్వాత..

ఢిల్లీ నుంచి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు రావడంతో విమానంలో భయాందోళన నెలకొంది. వెంటనే విమానాన్ని లక్నో విమానాశ్రయం వైపు మళ్లించారు. ఉదయం 9:17 గంటలకు లక్నోలో విమానాన్ని సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇండిగో విమానం 6E 6650 ఢిల్లీ నుంచి 222 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ విమానం పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రాకు వెళుతోంది. టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికి విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో విమానాన్ని లక్నో వైపు మళ్లించారు. ఉదయం 9:17 గంటలకు లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

విమానాశ్రయ అధికారుల‌ ప్రకారం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) విమానంలో బాంబు గురించి ఉదయం 8:46 గంటలకు సమాచారం అందింది. భద్రతా ప్రోటోకాల్‌లను దృష్టిలో ఉంచుకుని, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. భద్రతా సంస్థలు వెంటనే చర్యకు దిగాయి. ‘విమానంలో బాంబు ఉంది’ అని టిష్యూ పేపర్‌పై ఎవరో చేతితో రాసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన విమానం మొత్తం భయాందోళనకు గురి చేసింది. హడావుడిగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

ఏసీపీ రజనీష్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. "విమానంలోని టాయిలెట్‌లో టిష్యూ పేపర్‌ను వదిలారు. దానిపై విమానంలో బాంబు ఉందని రాసి ఉంది. విమానం బాగ్‌డోగ్రా వైపు వెళుతోంది. లక్నోలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన తర్వాత విమానాన్ని తనిఖీ చేశారు."

ఈ ఇండిగో విమానంలో 222 మంది ప్రయాణికులు, 8 మంది నవజాత శిశువులు ఉన్నారు. ఇది కాకుండా విమానంలో 2 పైలట్లు మరియు 5 మంది సిబ్బంది కూడా ఉన్నారు. అంద‌రూ పూర్తి సురక్షితంగా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై బాంబు నిర్వీర్య దళం, భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.

Next Story