అరేబియా సముద్రంలో గుజరాత్ పోలీసులు, ఏటీఎస్ సిబ్బంది కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో 150 కోట్ల విలువైన హెరాయిన్ ను సొంతం చేసేసుకున్నారు. మొత్తం 30 కిలోల బరువున్న ఈ హెరాయిన్ పాకిస్థాన్ నుండి భారత్ కు ఓ పడవలో తీసుకుని వస్తుండగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 మంది పాకిస్థానీయులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని జకావు పోర్టు దగ్గర పాకిస్థానీయులను పోలీసులు గుర్తించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవాలని అనుకోగా.. అంతలోపే అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లాలని పాకిస్థాన్ కు చెందిన బోట్ నిర్వాహకులు ప్రయత్నించారు. అంతలోపు పోలీసులు వారిని వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్ ఏటీఎస్ విభాగం ఈ ఘటనపై ప్రెస్ స్టేట్మెంట్ ను విడుదల చేసింది. పట్టుకున్న డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 150 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అధికారులు తెలిపారు. గుజరాత్ సముద్ర తీర ప్రాంతంలో చాలా కాలం నుండి డ్రగ్స్ ను భారత్ లోకి తరలించాలని కొన్ని ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు వారికి చెక్ పెడుతూ ఉన్నారు.