మ‌ద్యం దుకాణం ఎదుట మాజీ సీఎం నిర‌స‌న‌.. గ‌తేడాది కూడా ఇదే వైన్ షాప్‌..!

BJP's Uma Bharti ties stray cows in front of liquor shop in MP. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు ఉమాభారతి గురువారం మధ్యప్రదేశ్‌లోని

By M.S.R  Published on  3 Feb 2023 10:50 AM GMT
మ‌ద్యం దుకాణం ఎదుట మాజీ సీఎం నిర‌స‌న‌.. గ‌తేడాది కూడా ఇదే వైన్ షాప్‌..!

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు ఉమాభారతి గురువారం మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో మద్యం దుకాణం ముందు ఆవులను కట్టివేశారు. అయితే ఆమె ఈ పని చేయడానికి ఓ కారణం ఉంది. ప్రజలు ఆవు పాలు తాగాలని, మద్యం మానేయాలని పిలుపునిచ్చారు. నివారీ జిల్లాలోని ఓర్చాలో భారతీయ నిర్మిత విదేశీ మద్యం (IMFL) విక్రయించే దుకాణం ముందు నిలబడి, భారతి “షరబ్ నహీ, దూద్ పియో (పాలు తాగండి, మద్యం కాదు)” అని చెబుతూ వచ్చారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి ‘మద్యం కాదు.. ఆవు పాలు తాగండి’ అని చెప్పేందుకే తాను ఈ పనికి పూనుకున్నానని ఆమె వివరించారు.

మద్యపానంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడితే వచ్చే సొమ్ము కోసం ఆశపడొద్దని, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు మద్యపానం ఓ సమస్యగా మారిందని, దీనికి తాను కూడా కొంతవరకు కారణమేనని ఉమా భారతి చెప్పారు. అందుకే మధ్యప్రదేశ్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో మద్యపాన నిషేధం కోసం కృషి చేస్తానని ఉమా భారతి తెలిపారు. కాగా, తన షాపు ముందు ఆవును కట్టేయడంతో భయపడిన యజమాని వెంటనే షాపు మూసేసి వెళ్లిపోయాడు.

గతేడాది జూన్‌లో ఇదే మద్యం దుకాణంపై ఉమా భారతి ఆవు పేడను విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో మద్యం వినియోగానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం విడుదల చేసే మద్యం పాలసీకి తగిన సవరణలు చేయాలని, డి-అడిక్షన్‌ను ప్రోత్సహించడానికి మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

Next Story