కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 10 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కృష్ణరాజ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాందాస్‌కు పార్టీ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో శ్రీవాస్తను అభ్యర్థిగా ప్రకటించింది. మహదేవ్‌పురా నుంచి అరవింద్ లింబావలి స్థానంలో ఆయన భార్య మంజులను అభ్యర్థిగా నిలిపారు. దీంతో పాటు హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ స్థానం నుంచి మహేశ్‌కు టిక్కెట్టు ఇచ్చారు. ఈ రోజు కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్ ఆశించింది ఇదే స్థానం కావడం గమనార్హం.
అంతకుముందు ఏప్రిల్ 15న కాంగ్రెస్ శనివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం 43 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ విడుదల చేసిన జాబితా ప్రకారం.. కోలార్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కొత్తూర్జి మంజునాథ్ బరిలోకి దిగనున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వరుణతో పాటు కోలార్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భావించగా.. వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పేరును ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని వీడి శుక్రవారం కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడికి అథని నియోజకవర్గం నుంచి టికెట్ లభించింది. ఏప్రిల్ 6న విడుదల చేసిన కాంగ్రెస్ రెండో జాబితాలో 41 మంది అభ్యర్థులలో సర్వోదయ కర్ణాటక పార్టీకి చెందిన ఒక అభ్యర్థి ఉన్నారు. మేలుకోటే అసెంబ్లీ స్థానం నుంచి సర్వోదయ కర్ణాటక పార్టీకి చెందిన దర్శన్ పుట్టన్నయ్యను అభ్యర్థిగా ప్రకటించారు.