చీర‌ క‌ట్ట‌డంలో గిన్నీస్ రికార్డు సాధించింది.. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌రంలోనూ..

మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్‌సి శివసేన (ఏక్‌నాథ్ షిండే) పార్టీలో చేరారు.

By Kalasani Durgapraveen  Published on  29 Oct 2024 10:46 AM IST
చీర‌ క‌ట్ట‌డంలో గిన్నీస్ రికార్డు సాధించింది.. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌రంలోనూ..

మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్‌సి శివసేన (ఏక్‌నాథ్ షిండే) పార్టీలో చేరారు. చేరిక అనంత‌రం పార్టీ ఆమెను ముంబాదేవి అసెంబ్లీ స్థానం నుండి అభ్యర్థిగా ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ ఈ స్థానానికి అమీన్ పటేల్‌ను అభ్యర్థిగా నిర్ణయించింది. 'షైన నానా చూడాసమా' ఫ్యాషన్ డిజైనర్. ఆమె రాజకీయ నాయకురాలిగా మారిన‌ సామాజిక కార్యకర్త. ఆమె ముంబై మాజీ మేయర్ నానా చూడాసమా కుమార్తె. ఫ్యాషన్ పరిశ్రమలో షైనా భిన్నమైన స్థానాన్ని సాధించింది. ఆమె చీరను 54 రకాలుగా ధరించి ప్రసిద్ధి చెందింది. దీని వ‌ల్ల‌ ఆమెను 'క్వీన్ ఆఫ్ డ్రేప్స్' అని కూడా పిలుస్తారు. అత్యంత వేగంగా చీర కట్టినందుకు గానూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె పేరు మీద రికార్డు ఉంది. ఆమె 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర యూనిట్ కోశాధికారిగా కూడా ఉన్నారు.

ఆమె తన ఛారిటీ ఫ్యాషన్ షోలు.. ఐ లవ్ ముంబై, జెయింట్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనే రెండు NGOల ద్వారా సామాజిక సేవలో పాల్గొంటుంది. షైనా 1989లో ముంబైలోని క్వీన్ మేరీ స్కూల్ (ICSE బోర్డ్) నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. దీని తర్వాత ఆమె ముంబైలోని జేవియర్స్ కాలేజీ నుండి పొలిటికల్ సైన్స్‌లో పట్టా పొందింది. ఆమె న్యూయార్క్ ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా కూడా చేసింది. షైనా మార్వాడీ జైన మతానికి చెందిన మనీష్ మునోత్‌ను వివాహం చేసుకుంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఏక్‌నాథ్ షిండేకి ధన్యవాదాలు తెలిపారు. షైనా మాట్లాడుతూ.. ముంబైకర్లకు సేవ చేయడానికి.. మేము ఈ ప్రాంతంలో ఒక ప్రధాన సేవకురాలిగా ఉన్నామని చూపించడానికి ఇది నాకు ఒక అవకాశం అని నేను నమ్ముతున్నాను. నేను ఎప్పుడూ సౌత్ ముంబైలో ఉంటున్నాను. ఈ ప్రాంతంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో నాకు తెలుసు. ముంబై ప్రజలకు సేవ చేసేందుకై నేను కట్టుబడి ఉన్నానని పేర్కొంది.


Next Story