ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించగా.. శనివారం ఫలితాలు వెలువడిన ఉత్తరప్రదేశ్ లోని మిల్కీపూర్ ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీపై బీజేపీ విజయం సాధించింది. 30 రౌండ్ల కౌంటింగ్ తర్వాత బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాశ్వాన్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్‌పై 60 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.
రాజకీయంగా ప్రాముఖ్యం ఉన్న అయోధ్య జిల్లాలో భాగమైన మిల్కిపూర్ సీటు సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారింది. మిల్కిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చిన "ట్రైలర్" మాత్రమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రారంభించిన ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ చేతిలో బీజేపీ ఓటమి పాలైంది. ఆ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ అయిన మిల్కీపూర్ ఉపఎన్నికను కాషాయ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
2024లో బీజేపీని ఓడించి ఫైజాబాద్ (అయోధ్య) పార్లమెంటరీ స్థానానికి ఎస్పీకి చెందిన అవధేష్ ప్రసాద్ ఎన్నికవ్వడంతో షెడ్యూల్డ్ కులాల రిజర్వ్‌డ్ స్థానంలో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈసారి బీజేపీకి చెందిన చంద్రభాను పాశ్వాన్‌పై ఎస్పీ అవధేష్ కుమారుడు అజిత్ ప్రసాద్‌ను రంగంలోకి దింపింది. చంద్రభాను పాశ్వాన్ ఘన విజయం సాధించారు.