సింగర్ కెకె మరణంపై రాజకీయ దుమారం
BJP's Dilip Ghosh attacks Mamata Banerjee's govt over KK's death. ప్రముఖ సింగర్ కెకె మరణించిన సంగతి తెలిసిందే. కోల్‌కతాలోని నజ్రుల్ మంచా ఆడిటోరియంలో
By Medi Samrat Published on 1 Jun 2022 2:28 PM ISTప్రముఖ సింగర్ కెకె మరణించిన సంగతి తెలిసిందే. కోల్‌కతాలోని నజ్రుల్ మంచా ఆడిటోరియంలో తన కచేరీ ముగిసిన తర్వాత 53 ఏళ్ల గాయకుడు తాను బస చేసిన హోటల్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆయన మృతి చెందినట్లు సీఎంఆర్‌ఐ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం నాడు కోల్‌కతాలో ప్రదర్శన ఇచ్చిన కొన్ని గంటల తర్వాత కెకె మరణించారనే వార్త తెలిసింది.
ఆయన మరణంపై రాజకీయ దుమారం నెలకొంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ తీవ్ర విమర్శలు చేయడంతో బాలీవుడ్ నేపథ్య గాయకుడు కెకె మరణం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. KK సంగీత కచేరీ సమయంలో కోల్‌కతా అధికారులు చాలా తప్పులు చేశారని. ఆయన కచేరీ ఇచ్చే సమయంలో పూర్తి గందరగోళం నెలకొందని తేలింది.షో నుండి తిరిగి వచ్చిన వెంటనే కోల్‌కతాలోని గ్రాండ్ హోటల్‌లో కన్నుమూశారు. షో సమయంలో ఆయన వేడి ఎక్కువగా ఉందని కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఆడిటోరియం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. తమ అభిమాన గాయకుడిని కలవడం కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎక్కువగా వచ్చేసారు.. ఆడిటోరియం సామర్థ్యాన్ని మించి చొచ్చుకొచ్చారు. 2000-3000 కెపాసిటీ ఉంటే అంతకు మించి అభిమానులను లోపలకు అనుమతించారు. దీంతో ఫర్నీచర్ ను కొందరు ధ్వంసం చేయగా.. ఆడిటోరియం తలుపులు కూడా విరగ్గొట్టారు. అనేక వీడియోలలో.. ఆడిటోరియంలోని వేడి గురించి KK ఫిర్యాదు చేసిన క్లిప్ కూడా కనిపించింది. తన చెమటను టవల్ తో తుడుచుకుంటూ, ఆపై ఎయిర్ కండిషనింగ్ వైపు పైకి చూపుతూ, జట్టు సభ్యునితో మాట్లాడుతున్నట్లు కనిపించారు.
అటువంటి నివేదికలపై ఘోష్ స్పందిస్తూ, ప్రభుత్వం ప్రముఖులకు సరైన రక్షణ కల్పించడంలో విఫలమైందని.. పరిపాలనపై నియంత్రణను కోల్పోతోందని ఆరోపించారు. ప్రముఖులు సందర్శనకు వచ్చినప్పుడు నిర్వహణ లోపం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని, అలాంటి సెలబ్రిటీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. "ఇంత వేడిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత హాలులో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ కారణంగా అనారోగ్యం పాలయ్యి చివరికి మరణానికి దారితీసిందో లేదో నాకు తెలియదు. ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు" అని దిలీప్ ఘోష్ అన్నారు.