దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింల‌కు 'సౌగత్-ఏ-మోదీ' కిట్ల‌ను పంపిణీ చేయనున్న బీజేపీ

భారతీయ జనతా పార్టీ ఈద్ సందర్భంగా దేశవ్యాప్తంగా 32 లక్షల ముస్లీం కుటుంబాలకు బహుమతులు ఇవ్వనుంది.

By Medi Samrat
Published on : 25 March 2025 2:18 PM IST

దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింల‌కు సౌగత్-ఏ-మోదీ కిట్ల‌ను పంపిణీ చేయనున్న బీజేపీ

భారతీయ జనతా పార్టీ ఈద్ సందర్భంగా దేశవ్యాప్తంగా 32 లక్షల ముస్లీం కుటుంబాలకు బహుమతులు ఇవ్వనుంది. బీజేపీ మైనారిటీ మోర్చా 'సౌగత్-ఏ-మోదీ' కిట్‌ను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈద్ సందర్భంగా ఈ కిట్‌లను మసీదుల ద్వారా పేద ముస్లింలకు పంపిణీ చేస్తారు. మైనారిటీ మోర్చాకు చెందిన 32,000 మంది కార్య‌క‌ర్త‌లు 32,000 మసీదుల్లో 32 లక్షల మంది నిరుపేదలను గుర్తించ‌నున్నారు. ఆ తర్వాత వారికి ఈ సాయం అందజేస్తారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని నిజాముద్దీన్‌ నుంచి ఈ ప్రచారం ప్రారంభం కానుంది. పేద ముస్లిం కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగ జరుపుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్య‌క్ర‌మం కింద మైనారిటీ మోర్చాకు చెందిన 32,000 మంది కార్య‌క‌ర్త‌లు నిరుపేదలను చేరుకోవడానికి దేశవ్యాప్తంగా 32,000 మసీదులతో చేతులు కలుపుతారు.

బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. రంజాన్ పవిత్ర మాసం పేదలు, బలహీనమైన పొరుగువారికి, బంధువులకు సహాయం చేయడంపై ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మోర్చా గుడ్ ఫ్రైడే, ఈస్టర్, నవ్రోజ్, ఇండియన్ న్యూ ఇయర్‌లలో కూడా పాల్గొని 'సౌగత్-ఎ-మోదీ' కిట్‌లను పంపిణీ చేస్తుందని ఆయన చెప్పారు. ఇది మత సామరస్యాన్ని పెంపొందిస్తుందని మోర్చా పేర్కొంది.

'సౌగత్-ఎ-మోదీ' ప్రచారాన్ని గత ఆదివారం ప్రకటించారు. కిట్‌లో ఆహార పదార్థాలతో పాటు బట్టలు, పచ్చిమిర్చి, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, చక్కెర ఉంటాయి. మహిళల కిట్‌లో బట్టలు ఉంటాయి. పురుషుల కిట్‌లో కుర్తా-పైజామా ఉంటుంది. ఒక్కో కిట్ ధర రూ.500 నుంచి రూ.600 వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పేద ముస్లింలు కూడా ఈద్‌ను బాగా జరుపుకోవాలనేది ఈ ప్రచారం యొక్క లక్ష్యం.

జిల్లా స్థాయిలో కూడా ఈద్ మిలాన్ వేడుకలు నిర్వహించనున్నట్లు జమాల్ సిద్ధిఖీ తెలిపారు. మైనారిటీ మోర్చా జాతీయ మీడియా ఇన్‌చార్జి యాసిర్ జిలానీ మాట్లాడుతూ.. 'సౌగత్-ఎ-మోదీ' పథకం ముస్లిం సమాజంలో సంక్షేమ పథకాలను ప్రోత్సహించడం, బీజేపీ, ఎన్డీఏలు రాజకీయ మద్దతును పొందాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన ప్రచారమని అన్నారు.

Next Story