కేరళలో చరిత్ర సృష్టించిన బీజేపీ..!

కేరళలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చరిత్ర సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం రాజధాని తిరువనంతపురం మేయర్‌గా వివి రాజేష్ ప్రమాణ స్వీకారం చేశారు.

By -  Medi Samrat
Published on : 26 Dec 2025 3:15 PM IST

కేరళలో చరిత్ర సృష్టించిన బీజేపీ..!

కేరళలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చరిత్ర సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం రాజధాని తిరువనంతపురం మేయర్‌గా వివి రాజేష్ ప్రమాణ స్వీకారం చేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయ‌న మాట్లాడుతూ.. “మనమంతా కలిసి ముందుకు సాగుదాం... అందరినీ వెంట తీసుకెళ్దాం. మొత్తం 101 వార్డుల్లో అభివృద్ధి చేద్దాం.. తిరువనంతపురంను అభివృద్ధి చెందిన నగరంగా మారుద్దాం.’’ అన్నారు. ఈ ఎన్నికల్లో 101 వార్డులకు గాను 50 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. త‌ద్వారా అతిపెద్ద పార్టీగా నిలిచి కేరళలో తొలిసారిగా ఓ మున్సిపల్ కార్పొరేషన్ గ‌ద్దెనెక్కింది.

శుక్రవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో రాజేష్‌కు 51 ఓట్లు రాగా, ఇందులో స్వతంత్ర కౌన్సిలర్ మద్దతు కూడా ఉంది. ఎల్‌డిఎఫ్‌కు చెందిన పి.శివాజీకి 29 ఓట్లు రాగా, యుడిఎఫ్ అభ్యర్థి కె.ఎస్.శబరినాథన్‌కు 19 ఓట్లు వ‌చ్చాయి. వాటిలో రెండు చెల్లవని ప్రకటించారు. దీంతో తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్‌గా రాజేష్ ప్రమాణ స్వీకారం చేశారు.

దాదాపు నాలుగు దశాబ్దాల ఎల్‌డీఎఫ్‌ పాలన తర్వాత కార్పొరేషన్‌ ఇప్పుడు బీజేపీ ఆధీనంలోకి వ‌చ్చింది. రాజేష్ మేయర్ కావడం కేరళ పట్టణ రాజకీయాల్లో బీజేపీకి కొత్త అధ్యాయానికి నాంది. రాష్ట్ర రాజధానిలో బీజేపీ విజయం సాధించ‌డం అంటే 45 ఏళ్లుగా సీపీఎంకు ఉన్న ప‌ట్టు త‌ప్పింద‌నే చెప్పాలి.

"కాంగ్రెస్ పరోక్ష, తెరవెనుక మద్దతుతో సీపీఎం తిరువనంతపురంను నాశనం చేసింది" అని కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ కార్యక్రమం అనంతరం విలేకరులతో అన్నారు.

Next Story