బీజేపీ ఒక విషసర్పం.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఉదయనిధి స్టాలిన్
బీజేపీ 'విష పాము' అని, దాని పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తమిళనాడు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆదివారం అన్నారు.
By అంజి
బీజేపీ విషసర్పం.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఉదయనిధి స్టాలిన్
బీజేపీ 'విష పాము' అని, దాని పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తమిళనాడు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆదివారం అన్నారు. సనాతన ధర్మంపై బీజేపీ తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నదని ఉదయనిధి ఆరోపించారు. తమిళనాడులో అన్నాడీఎంకే మద్దతుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న జాతీయ పార్టీ విషసర్పం లాంటిదని అన్నారు. రెండు పార్టీలకు చోటు కల్పించవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. జీ20 సదస్సు సందర్భంగా నరేంద్ర మోదీ ప్రచారం చేసిన అభివృద్ధి మురికివాడలను కప్పివేసిందని అన్నారు.
జీ20 సదస్సులో తన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విందు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ అంశాల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ఇటీవల సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఓ సదస్సులో తాను చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి , కులనిర్మూలనకు పిలుపునిచ్చిందని అసత్య ప్రచారం చేస్తోందని ఉదయనిధి ఆరోపించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పాటుపడిన డీఎంకే సనాతన ధర్మం వంటి సాంఘిక దురాచారాలను ప్రశ్నించేందుకే స్థాపించబడింది. సనాతన ధర్మం సతీ ధర్మాన్ని ప్రోత్సహించి , స్త్రీలను బానిసలుగా పరిగణిస్తున్నందున, ద్రావిడ ఉద్యమం దానిని వ్యతిరేకించింది. డీఎంకె దశాబ్దాలుగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతోందని , అలాగే కొనసాగుతుందని ఆయన అన్నారు.
అంతకుముందు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. దోమలు, డెంగ్యూ, మలేరియా, కరోనా లాగానే.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య స్పందిస్తూ.. దేశంలోని 80 శాతం మంది హిందువులను మారణహోమం చేయాలని ఉదయనిధి పిలుపునిచ్చారని అన్నారు. రాజస్థాన్‌లో జరిగిన బహిరంగ కార్యక్రమాలలో అమిత్ షా కూడా ఉదయ నిధి వ్యాఖ్యలపై ప్రతిధ్వనించారు.