రాహుల్‌గాంధీపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు

దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  1 April 2024 6:01 PM IST
bjp, complaint,  ec,  rahul gandhi, congress,

రాహుల్‌గాంధీపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు 

దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ సహా ఎన్డీఏ కూటమి పార్టీలు అన్ని వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఇక ఈసారైనా ఎన్డీఏ సర్కార్‌కు షాక్‌ ఇచ్చేలా.. తాము ఎక్కువ సీట్లు గెలవాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని పార్టీలు కూటముల నుంచి బయటకు వస్తుంటే.. ఇంకొన్ని అసంతృప్తిని చెబుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది.

లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిందనీ.. ఎన్నికలను బీజేపీ రిగ్గింగ్ చేస్తోందని రాహుల్‌ గాంధీ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీ సందర్భంగా ఈవ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై బీజేపీ సీరియస్‌గా స్పందించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాహుల్‌గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈ సందర్భంగా హర్దీప్‌సింగ్‌ పూరి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌గాంధీ మోడల్‌ కోడ్‌ ఆఫ్ కండక్టన్‌ను ఉల్లంఘించారని చెప్పారు. ఈవీఎంలపైనా, ఎన్నికల కమిషన్‌పైనా విశ్వసనీయత లేదని చెప్పారనీ.. ఇది నిబంధనలు ఉల్లంఘించడం కిందకే వస్తుందని హర్దీప్‌సింగ్ పూరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంలో తన మనుషులను పెట్టిందని ఆరోపించడం సరికాదని అన్నారు. రాహుల్‌గాంధీ పదేపదే ఈ కామెంట్స్ చేస్తున్నారీ.. అందుకే తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు హర్దీప్‌ సింగ్ పూరి చెప్పారు. అందుకే రాహుల్‌గాంధీని ప్రస్తుత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించకుండా ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story