కలిసి పోటీ చేస్తాం.. పొత్తు ప్రకటన చేసిన అమిత్ షా
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By Medi Samrat
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాయి. ఇక తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకేలు కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. రెండు పార్టీల మధ్య పొత్తుపై చర్చ సాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో అన్నామలై, ఏఐఏడీఎంకే ఎడప్పాడి పళనిస్వామితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ, కూటమి పార్టీలన్నీ కలిసి ఎన్డీయేగా పోటీ చేయాలని అన్నాడీఎంకే, బీజేపీ నేతలు నిర్ణయించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎన్డీయేకు మళ్లీ భారీ మెజారిటీ వస్తుందని, తమిళనాడులో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాని మోడీ నాయకత్వంలో.. రాష్ట్ర స్థాయిలో అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో జరుగుతాయని అన్నారు. రాష్ట్రంలో పళనిస్వామి నేతృత్వంలో పోరాటం చేస్తామన్నారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని, ఈ పొత్తు ఎన్డీఏ, అన్నాడీఎంకే రెండింటికీ లాభదాయకమని చెప్పారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ మళ్లీ అఖండ మెజారిటీ సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.