ఒలింపిక్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు బీజేపీ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు రెజ్లర్లపై మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విమర్శలు చేసిన కొద్ది రోజుల తర్వాత బీజేపీ అగ్రనేతల నుండి కీలక సూచనలు వచ్చాయి. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా గత సంవత్సరం బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెజ్లర్‌లను వేధిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనలకు దిగడం దేశ వ్యాప్తంగా సంచలనమైంది.
తాను పారిస్ ఒలింపిక్స్‌లో ఓడిపోయినందుకు సంతోషంగా ఉన్నవారిని దేశవిద్రోహులని వినేష్ ఫోగట్ అన్నారు. వినేష్ ఫోగట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో జులనా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యారు. ఆదివారం జులనాలో తన తొలి రాజకీయ ర్యాలీని నిర్వహించింది. గత 1.5 ఏళ్లుగా కొందరు నాయకులు ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని.. వాటిని వింటూనే ఉన్నామన్నారు. ఇది వారి మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. నేను ఒలింపిక్స్‌లో గెలవనందుకు సంతోషిస్తున్నామని చెబుతున్నట్లయితే, వారిపై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. ఆ పతకం నాది కాదు యావత్ దేశానిది. వారు దేశాన్ని అగౌరవపరిచారని వినేష్ ఫోగట్ మీడియాకు తెలిపారు.