విడాకుల కోసం భార్య రూ.10 లక్షల డిమాండ్.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త
నా మూత్ర పిండం అమ్మకానికి సిద్ధంగా ఉంది. 21న నా ఆత్మాహుతి కార్యక్రమం అని రాసి భార్యతో కలిసి, విడివిడిగా ఉన్న ఫొటోలతో
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 1:11 PM ISTకిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త
ఇటీవల కాలంలో భార్యబాధితులం అంటూ పలువురు సంఘాలుగా ఏర్పడి న్యాయం చేయాలంటూ దీక్షలు, నిరసనలు చేపట్టిన ఘటనలు చూశాం. అయితే.. వీరికి భిన్నంగా ఓ భార్యా బాధితుడు చేసిన పని అందర్నీ ముక్కన వేలు వేసుకునేలా చేస్తుంది. వినడానికి విచిత్రంగానే అనిపించినా.. దాని వెనుక అంతులేని ఆవేదన ఉంది. భార్యకు భరణం చెల్లించడానికి ఏకంగా తన కిడ్నీని అమ్మేందుకు సిద్దం అయ్యాడు. ఒక వేళ నిర్ణీత సమయానికి డబ్బులు అందకపోతే ఆత్మహత్యకు కూడా రెడీ అయ్యాడు.
బీహార్ రాజధాని పాట్నాకు చెందిన సంజీవ్‌కు ఆరేళ్ల క్రితం ఓ మహిళతో వివాహామైంది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తరువాతే అతడికి కష్టాలు మొదలు అయ్యాయి. భార్య,బావమరిది, అత్తమామల నుంచి వేధింపులు ప్రారంభం అయ్యాయి. నిత్యం వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వాటిని భరించలేక భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఇదే విషయాన్ని భార్యకు చెప్పగా.. తాను విడాకులు ఇవ్వాలంటే భరణం కింద పది లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. తనకు ఈ బాధల నుంచి విముక్తి కల్పించాలంటూ పలుమార్లు సంజీవ్ పోలీసులను ఆశ్రయించాడు. అయినప్పటికీ ఫలితం లేదు.
దీంతో విసుగెత్తిన సంజీవ్.. "భార్యకు భరణం ఇచ్చేందుకు నా వద్ద డబ్బులు లేవు. అందుకోసం నా కిడ్నీ అమ్మడానికి సిద్ధంగా ఉన్నా. ఒక వేళ ఈ నెల 21లోగా కిడ్నీని అమ్ముకోగలిగితే నా భార్యకు విడాకులు ఇస్తా. అలా కాని పక్షంలో అదే రోజు ఆత్మహుతి కార్యక్రమం నా స్వస్థలమైన పాట్నాలో ఉంటుంది." అనే బ్యానర్ పట్టుకుని తిరగడం ప్రారంభించాడు.
ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లను ఆహ్వానిస్తూ బ్యానర్‌పై వారి పేర్లను ముద్రించాడు. బ్యానర్ రెండోవైపు భార్య, బావమరిది, వారి బంధువుల ఫొటోలను ముద్రించాడు. కొందరు దీన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది