బీహార్‌లో రోజురోజుకూ పెరుగుతున్న దొంగతనాలు, దోపిడీ ఘటనల దృష్ట్యా బులియన్ వ్యాపారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ముఖాలకు ముసుగు కప్పుకుని జ్యూయలరీ షాపులకు వచ్చే వినియోగదారులకు ఆభరణాలు విక్రయించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్స్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) బీహార్ యూనిట్ ఈ మేరకు తమ సభ్యులకు ఆదేశాలు కూడా జారీ చేసింది.
భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐజేజీఎఫ్ బీహార్ యూనిట్ అధ్యక్షుడు అశోక్ కుమార్ వర్మ బుధవారం పాట్నాలో విలేకరులతో అన్నారు. ముఖానికి మాస్క్‌లు ధరించి వచ్చిన వినియోగదారులు లేదా మహిళలు హిజాబ్ ధరించి దుకాణంలోకి ప్రవేశిస్తే వారికి ఆభరణాలు చూపించబడవు, విక్రయించబడవు అని పేర్కొన్నారు.
ప్రెసిడెంట్ అశోక్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. కస్టమర్లు ముఖానికి గుడ్డ కట్టుకుంటే వారిని గుర్తించడం కష్టమవుతుందని అన్నారు. ఏదైనా నేర సంఘటనలు జరిగితే సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది. ఆభరణాల దుకాణదారులు, కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ముసుగులు ధరించిన నేరగాళ్లతో నగల దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయన్నారు. బీహార్‌లో కూడా 2024 మార్చిలో, భోజ్‌పూర్ జిల్లాలోని నగల దుకాణంలో సుమారు రూ. 25 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకోగా, నవంబర్‌లో సివాన్ జిల్లాలో మరో బులియన్ దుకాణాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.