దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల దృష్ట్యా బీహార్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జైవిక్ ఉద్యాన్‌తో సహా రాష్ట్రంలోని అన్ని పార్కులను డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు మూసివేయాలని బీహార్ ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. బీహార్‌లోని ఏ పార్క్‌లోనూ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించకూడదని నిర్ణయించామని, కొత్త సంవత్సరం సందర్భంగా రద్దీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వుల ప్రకారం.. కొవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ఎలాంటి రాజకీయ, సామాజిక, మత, సాంస్కృతిక, క్రీడలకు సంబంధించిన ఈవెంట్‌లను నిర్వహించాలంటే ప్రభుత్వ అనుమతులను తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.
మరోవైపు దేశంలో ఒక్క రోజులోనే 127 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఓమిక్రాన్ కేసుల సంఖ్య 781కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీ 238 ఓమిక్రాన్ కేసులతో అగ్ర స్థానంలో ఉండగా తర్వాత స్థానంలో 167 కేసులతో మహారాష్ట్ర ఉంది. ఇక గుజరాత్ రాష్ట్రంలో 73, కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్థాన్ 46, కర్ణాటక 34, తమిళనాడులో 34 కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 241 ఓమిక్రాన్ కేసుల పెరుగుదల వెలుగులో, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రిపూట కర్ఫ్యూతో సహా కోవిడ్-భద్రతా నియంత్రణలను అమలు చేశాయి.