మద్యపాన నిషేధానికి బిహార్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఆ రాష్ట్ర డీజీపీ సందీప్ కుమార్ సింఘాల్ తన తోటి పోలీసులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. మద్యాన్ని జీవితంలో ముట్టుకోబోమని ప్రమాణం చేశారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మద్యపానం నిషేధాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. పాట్నాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం నాడు ఈ కార్యక్రమం జరిగింది. మద్యపాన నిషేధ నిబంధనలను ఉల్లంఘించే పోలీసులను విధుల నుండి తొలగిస్తామని డీజీపీ సందీప్ కుమార్ పేర్కొన్నారు.
మీడియాతో సింఘాల్ మాట్లాడుతూ.. మద్యం ప్రొబేషన్ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రతి పోలీసు సిబ్బంది కట్టుబడి ఉన్నారని అన్నారు. మద్యపాన నిషేధానికి సంబంధించిన సానుకూలతను సమాజం చూసింది. చట్టాన్ని అమలు చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని డీజీపీ తెలిపారు. మద్యాన్ని నిషేధించడంతో పాటు డ్రగ్స్‌పై పని చేయడానికి కూడా కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఎవరైనా పోలీసు సిబ్బంది మద్యం కలిగి ఉన్నట్లు నోటీసుకు వస్తే అతనిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తామని అన్నారు.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ అధికారులతో కలిసి సీఎం ప్రమాణః చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. మద్యంతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని సీఎం నితీష్ తెలిపారు. అధికారులు మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు.