కాసేపట్లో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు

బీహార్‌లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు నితీశ్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది.

By Medi Samrat
Published on : 26 Feb 2025 2:45 PM IST

కాసేపట్లో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు

బీహార్‌లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు నితీశ్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ వెల్లడించారు. నితీష్ కేబినెట్‌లో కొత్తగా ఏడుగురు మంత్రులకు చోటు కల్పిస్తామని చెప్పారు. వీరంతా బీజేపీ కోటా నుంచి వచ్చినవారే.

ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారోత్సవానికి గవర్నర్ అంగీకరించారని, బీజేపీ కోటాలో ఏడుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని, మార్చి 4న బీహార్ కొత్త బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సమావేశం జరుగనుంద‌ని బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ తెలిపారు.

సీఎం నితీశ్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి, బీజేపీ రాష్ట్ర చీఫ్‌ జైస్వాల్‌ నివాసాల్లో రాజకీయ కార్యకలాపాలు జోరందుకున్నాయి. కొత్త మంత్రుల తుది జాబితాకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం.

నితీష్ కుమార్ కేబినెట్‌లో రాజ్‌పుత్ కులానికి చెందిన జనక్ సింగ్, రాజు సింగ్, అరుణా దేవి, అనిల్ శర్మ, భూమిహార్ కులానికి చెందిన దేవకాంత్, యాదవ్ కులానికి చెందిన నావల్ కిషోర్ యాదవ్, అత్యంత వెనుకబడిన కులాల‌ (EBC) నుండి విజయ్ మండల్‌లకు కేబినెట్‌లో చోటు క‌ల్పించిన‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు బీహార్ రెవెన్యూ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ పార్టీ 'ఒకే వ్యక్తి, ఒకే పదవి' విధానాన్ని పేర్కొంటూ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెవిన్యూ మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నానని.. 'ఒకే వ్యక్తి, ఒకే పదవి' అనే సిద్ధాంతంపై పార్టీ పనిచేస్తోందని, కేంద్ర నాయకత్వం నాకు పార్టీ రాష్ట్ర శాఖ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని జైస్వాల్ అన్నారు. జైస్వాల్‌ను జనవరి 18న బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు.

Next Story