పాట్నా: బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో 121 నియోజకవర్గాలు, రెండో దశలో 122 నియోజకవర్గాలు పోలింగ్‌లో భాగమవుతాయి.
మొదటి దశకు గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 10, 2025 (శుక్రవారం)న విడుదలవుతుంది. నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 17, పరిశీలన అక్టోబర్ 18, ఉపసంహరణ అక్టోబర్ 20గా నిర్ణయించారు. పోలింగ్ నవంబర్ 6 (గురువారం) జరుగుతుంది.
రెండో దశకు గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 13 (సోమవారం)న వెలువడుతుంది. నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 20, పరిశీలన అక్టోబర్ 21, ఉపసంహరణ అక్టోబర్ 23. రెండో దశ పోలింగ్ నవంబర్ 11 (మంగళవారం) జరుగుతుంది.
కాగా రెండు దశల ఓట్ల లెక్కింపు నవంబర్ 14 (శుక్రవారం) జరగనుంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ నవంబర్ 16 (ఆదివారం)లోపు పూర్తి చేయాలని కమిషన్ తెలిపింది.