17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్న మనీష్ సిసోడియా..!

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది

By Medi Samrat  Published on  9 Aug 2024 9:08 AM GMT
17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్న మనీష్ సిసోడియా..!

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆయ‌న‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్ట్‌ అప్పగించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించవద్దని కోర్టు కోరింది. సచివాలయానికి వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ అనంతరం ఆగస్టు 6న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

సిసోడియా 17 నెలలుగా కస్టడీలో ఉన్నారని.. ఇంకా విచారణ ప్రారంభం కాలేదని.. దీని వల్ల సత్వర విచారణ హక్కును కోల్పోతున్నారని కోర్టు పేర్కొంది. ఈ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు పంపడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందన్నారు. బెయిల్ సూత్రం ఒక నియమమని.. జైలు మినహాయింపు అని ట్రయల్ కోర్టు, హైకోర్టు అంగీకరించే సమయం ఇప్పుడు వచ్చిందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు.. అంతే మొత్తానికి ఇద్దరి షూరిటీతో సిసోడియాను బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పనలో.. దాని అమలులో అవకతవకలకు పాల్పడినందుకు సిసోడియాను అరెస్టు చేశారు. ఫిబ్రవరి 26, 2023 న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఆయ‌న‌ను అరెస్టు చేసింది. ఈడీ కూడా సిసోడియాపై అనేక రకాల ఆరోపణలు చేసింది. దీంతో 2023 ఫిబ్రవరి 28న ఢిల్లీ క్యాబినెట్‌కు రాజీనామా చేశారు. తాను 17 నెలలుగా కస్టడీలో ఉన్నానని.. తనపై ఇంకా విచారణ ప్రారంభం కాలేదని సిసోడియా బెయిల్‌ను కోరారు. ఈడీ, సీబీఐ ఆయన బెయిల్ పిటిషన్లను వ్యతిరేకించాయి.

Next Story