తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో జమ్మూలో నిర్మించ తలపెట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ జరిగింది. జమ్ములోని మజీన్ ప్రాంతంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జితేంద్రసింగ్, కిషన్ రెడ్డితోపాటు టీటీడీ 28 మంది బోర్డు సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు శాసనసభ్యులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, 12 మంది ప్రత్యేక ఆహ్వానితుల సమక్షంలో భూమిపూజ వేడుక ఘనంగా జరిగింది.
ఆలయ నిర్మాణానికి కశ్మీర్ ప్రభుత్వం 62 ఎకరాలు కేటాయించింది. కశ్మీర్ ప్రభుత్వం భూమిని టీటీడీకి లీజ్‌కు ఇచ్చింది. అద్దె కింద రూ. లక్షా 98 వేలు జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి చెల్లించి భూమిని టీటీడీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక తొలివిడతగా.. 17 ఎకరాల్లో ఆలయ కాంప్లెక్స్‌తోపాటు సరిహద్దు గోడ, వేద పాఠశాల, సిబ్బంది క్వార్టర్స్, భక్తుల వసతి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు రూ. 33 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.