పీవీ న‌ర్సింహారావు, చ‌ర‌ణ్‌సింగ్‌, స్వామినాథ‌న్‌ల‌కు భార‌త ర‌త్న

ప్రధాని మోదీ శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. ఒకేరోజు దేశంలోని ముగ్గురు ప్రముఖులను భారతరత్నతో సత్కరించనున్నట్లు ప్రకటించారు.

By Medi Samrat  Published on  9 Feb 2024 2:01 PM IST
పీవీ న‌ర్సింహారావు, చ‌ర‌ణ్‌సింగ్‌, స్వామినాథ‌న్‌ల‌కు భార‌త ర‌త్న

ప్రధాని మోదీ శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. ఒకేరోజు దేశంలోని ముగ్గురు ప్రముఖులను భారతరత్నతో సత్కరించనున్నట్లు ప్రకటించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్ ల‌ను భారతరత్నతో సత్కరించనున్నట్లు ప్రకటించారు.

పీవీ నరసింహారావు విశిష్ట పండితులు. రాజకీయవేత్తగా వివిధ హోదాలలో భారతదేశానికి విస్తృతంగా సేవలందించారని ప్ర‌ధాని త‌న ఎక్స్‌ పోస్ట్‌లో రాశారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలం ముఖ్యంగా గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఆయ‌న‌ పదవీకాలంలో భారతదేశం ప్రపంచ మార్కెట్ స్థాయికి విస్త‌రించింది. ఇది ఆర్థిక వృద్ధి యొక్క కొత్త శకానికి దారితీసిందని పేర్కొన్నారు.

దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం మన ప్రభుత్వ అదృష్టమని మోదీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దేశానికి ఆయన చేసిన సాటిలేని కృషికి ఈ గౌరవం అంకితం. ఆయన తన జీవితమంతా రైతుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం అంకితం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా, దేశానికి హోంమంత్రి అయినా, ఎమ్మెల్యేగా కూడా దేశ నిర్మాణానికి ఊతమిచ్చారని కూడా రాశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడా గట్టిగా నిలబడ్డారు. మన రైతు సోదర సోదరీమణుల పట్ల ఆయనకున్న అంకితభావం, ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న నిబద్ధత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.

దేశంలో హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ప్ర‌క‌టించింది కేంద్రం. మన దేశంలో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి విశేష కృషి చేసినందుకు గాను భారత ప్రభుత్వం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ జీని భారతరత్నతో సత్కరిస్తోందని ప్రధాని త‌న‌ పోస్ట్‌లో రాశారు. ఆయ‌న భారతదేశం వ్యవసాయంలో స్వావలంబన సాధించడంలో కీలక పాత్ర పోషించారు. భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయత్నాలు చేశార‌ని కొనియాడారు.

Next Story