ఒమిక్రాన్ వంటి కరోనా వైరస్ వేరియంట్‌లకు వ్యతిరేకంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ షాట్ పనిచేస్తుందో లేదో అధ్యయనం చేస్తున్నట్లు భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ మంగళవారం తెలిపింది. ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 వ్యాక్సిన్‌లు తక్కువ ప్రభావవంతంగా ఉంటాయని డ్రగ్‌మేకర్ మోడెర్నా CEO స్టెఫాన్ బాన్సెల్ తాజా హెచ్చరికతో పరిశోధనలు ప్రారంభించారు. వైరస్ మొదట ఉద్భవించిన చైనా నగరాన్ని ప్రస్తావిస్తూ "కోవాగ్జిన్ అసలు వుహాన్‌లో వెలుగు చూసిన కరోనా వేరియంట్‌కు వ్యతిరేకంగా అభివృద్ధి చేయబడింది" అని భారత్ బయోటెక్ ప్రతినిధి చెప్పారు.
"ఇది డెల్టా వేరియంట్‌తో సహా ఇతర వేరియంట్‌లకు వ్యతిరేకంగా పని చేయగలదని నిరూపించింది. అయితే తాము కొత్త వేరియంట్‌లపై కొవాగ్జిన్ ఎలా పని చేస్తుందో తెలుసుకునే పరిశోధనను కొనసాగిస్తున్నాము." అని తెలిపారు. కాగా ఇప్పటికే పలు వ్యాక్సిన్ తయారీ సంస్థలు.. తాము తయారు చేసిన వ్యాక్సిన్ ఒమ్రికాన్‌పై ఏ విధంగా పని చేస్తుందనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. బూస్టర్ డోసు అధిక మోతాదుతో పరీక్షలు జరుపుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఒమ్రికాన్ ఆందోళనలు నెలకొన్నాయి. ఈ కొత్త వేరియంట్ ప్రపంచాన్ని మరోసారి కలవరానికి గురి చేస్తోంది. ఒమ్రికాన్‌పై కొవిషీల్డ్ వ్యాక్సిన్ పనితీరుపై సీరం ఇనిస్టిట్యూట్ స్పందించింది. ఒమ్రికాన్ వేరియంట్‌ను కొవిషీల్డ్ ఎంత మేరకు ఎదుర్కొంటుందనే విషయం మరో రెండు వారాల్లో తెలుస్తుందని అదర్ పునావాలా చెప్పారు. అయితే ఒమ్రికాన్‌ను వ్యాక్సిన్లు సమర్థవంతంగా ఎదుర్కోలేవని చెప్పడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ చెప్పింది.