బెంగళూరులో ఓ పదో తరగతి విద్యార్థిని తాము నివసిస్తోన్న అపార్ట్‌మెంట్‌లోని 20వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పదే పదే మొబైల్ ఫోన్ చూస్తుందని తల్లి మందలించడంతో ఆ విద్యార్థిని మనస్తాపం చెందినట్లు సమాచారం. తూర్పు బెంగళూరులోని కడుగోడి శివారు ప్రాంతంలోని అసెట్జ్ మార్క్ అపార్ట్‌మెంట్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
మృతురాలు అవంతికి చౌరాసియా వైట్ ఫీల్డ్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతోంది. అయితే మార్చి 15వ తేదీన ప్రిపరేటరీ పరీక్షలు జరగనుండటంతో, విద్యార్థులకు ప్రిపరేషన్ హాలీడేస్ ఇచ్చారు. ఇంట్లోనే ఉన్న అవంతిక తన తల్లి నమ్రత మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుంది. అది గమనించిన నమ్రత చదువుపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చింది. తల్లి అడగడంతో మనస్తాపం చెందిన అవంతిక తన రూమ్‌లోని కిటికీ తెరిచి అక్కడి నుంచి దూకింది.
అవంతిక కిందకు దూకడాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కడుగోడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.