కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వాహనాల్లో వెళ్లడం కంటే నడుచుకుంటూ వెళ్లడమే బెటర్ అని అంటూ ఉంటారు. బెంగుళూరుకు చెందిన ఓ వైద్యుడు కారును వదిలి.. శస్త్ర చికిత్స చేయడానికి ఏకంగా 3 కి.మీ. దూరం పరిగెత్తాడు. బెంగళూరులో తక్కువ దూరం ప్రయాణించడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఓ రోగికి చేయాల్సిన శస్త్ర చికిత్స కోసం సదరు వైద్యుడు పరిగెత్తుకుంటూ వెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన రోగి ప్రాణాలను కాపాడేందుకు ఓ డాక్టర్ తీసుకున్న అసాధారణ నిర్ణయం స్ఫూర్తిదాయకమైనదిగా భావిస్తూ ఉన్నారు.
మణిపాల్ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ గోవింద్ నందకుమార్ ఆగస్టు 30న అత్యవసర లాపరోస్కోపిక్ పిత్తాశయ శస్త్రచికిత్స చేసేందుకు వెళుతుండగా సర్జాపూర్-మారతహల్లి మార్గంలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. ఆలస్యమైతే సదరు మహిళా రోగికి హాని కలుగుతుందని గ్రహించిన డాక్టర్ నందకుమార్ తన కారును వదిలి మూడు కిలోమీటర్లు పరిగెత్తి కీలకమైన శస్త్ర చికిత్స చేశారు.
"నేను ప్రతిరోజు సెంట్రల్ బెంగుళూరు నుండి బెంగుళూరుకు ఆగ్నేయంలో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్, సర్జాపూర్‌కి ప్రయాణిస్తాను. నేను సర్జరీ చేయడానికి సమయానికే ఇంటి నుండి బయలుదేరాను. నా బృందం అంతా సిద్ధంగా ఉంది. నేను హాస్పిటల్ కు చేరుకుని శస్త్రచికిత్స చేయడానికి అందరూ సిద్ధమయ్యారు. విపరీతమైన ట్రాఫిక్ ను చూసి, కారు డ్రైవర్‌తో పాటే వదిలేయాలని నిర్ణయించుకున్నాను.. అనుకున్నట్లుగానే హాస్పిటల్ వైపు పరుగెత్తాను," అని చెప్పారు. ఏ మాత్రం ఆలస్యం అవ్వకపోవడంతో.. శస్త్రచికిత్స విజయవంతమైంది. రోగిని సమయానికి డిశ్చార్జ్ చేశారు.