టీనేజీ బాలికపై అత్యాచారం, హత్య.. 63 రోజుల్లోనే విచారణ పూర్తి.. నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష విధించిన కోర్టు

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని జైనగర్‌లో టీనేజీ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ముస్తాకిన్ సర్దార్ అనే దోషికి కోర్టు మరణశిక్ష విధించింది.

By Medi Samrat  Published on  6 Dec 2024 6:54 PM IST
టీనేజీ బాలికపై అత్యాచారం, హత్య.. 63 రోజుల్లోనే విచారణ పూర్తి.. నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష విధించిన కోర్టు

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని జైనగర్‌లో టీనేజీ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ముస్తాకిన్ సర్దార్ అనే దోషికి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ముస్తాకిన్‌ను బరుయ్‌పూర్‌లోని క్విక్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి సుబ్రతా చటోపాధ్యాయ గురువారం దోషిగా నిర్ధారించారు. ఆ తర్వాత శుక్రవారం మరణశిక్షను ఖరారు చేసింది.

ఆర్జీ క‌ర్ వైద్యురాలి కేసుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న వేళ జైనగర్‌లో జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. జయనగర్‌లోని బాధితురాలి ఇంటికి కూడా ఆర్జీ క‌ర్‌ ఆందోళనకారులు వెళ్లారు. ఆర్‌జి కర్‌కు చెందిన మహిళా వైద్యురాలికి న్యాయం చేయాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు, అయితే నాలుగు నెలలు గడిచినా ఆర్‌జి కర్ కేసులో న్యాయం జరగలేదు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు జయనగర్ ఘటనలో కేవలం 63 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నిందితులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

దీనిపై రాష్ట్ర పోలీసులు ఓ పోస్ట్ పెట్టారు అందులో జయనగర్ కు న్యాయం అని రాసి ఉంది. ఈ నిర్ణయం అపూర్వమైనది. బెంగాల్‌లో మునుపెన్నడూ లేనివిధంగా అత్యాచారం-హత్య కేసులో దోషిని కేవలం 63 రోజుల్లో ఉరితీయాలని ఆదేశాలు ఇవ్వలేదు. ఈ కేసు దర్యాప్తులో మా ఏకైక లక్ష్యం బాధితురాలికి.. ఆమె కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేయడమే. అమ్మాయి తిరిగి రాదు. కానీ అపూర్వమైన వేగంతో మేము ఆమె కుటుంబానికి 'న్యాయం' అందించగలిగాము అని పేర్కొన్నారు.

కోర్టు తీర్పుపై సీఎం మమతా బెనర్జీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. X లో పోస్ట్ చేస్తూ.. అక్టోబరు 4న జైనగర్‌లో మైనర్ బాలికను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 62 రోజుల తర్వాత బరుయ్‌పూర్‌లోని పోక్సో కోర్టు ఈ రోజు నిందితుడికి మరణశిక్ష విధించింది. ఇలాంటి కేసులో కేవలం రెండు నెలల్లోనే దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించడం రాష్ట్ర చరిత్రలో అపూర్వమైనది. ఈ అత్యద్భుత విజయానికి రాష్ట్ర పోలీసులను, ప్రాసిక్యూషన్ ప్రక్రియలో పాలుపంచుకున్న వారందరినీ నేను అభినందిస్తున్నాను. మహిళలపై జరిగే నేరాల పట్ల ప్రభుత్వం ఏమాత్రం సహనం చూపదు.. న్యాయం జాప్యం జరగకుండా లేదా తిరస్కరించబడకుండా ఉండేలా చూస్తుందని పేర్కొన్నారు.

Next Story