తెలుగు రాష్ట్రాల్లో జనవరి 22న సెలవు ఇవ్వాల్సిందే..!
అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరుపుతున్న కార్యక్రమం కారణంగా జనవరి 22 న దేశవ్యాప్తంగా
By Medi Samrat Published on 19 Jan 2024 3:42 PM ISTఅయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరుపుతున్న కార్యక్రమం కారణంగా జనవరి 22 న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలవు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థల్లోని ఉద్యోగులకు జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. ఉద్యోగులు ఆ వేడుకల్లో పాల్గొనడానికి వీలుగా, అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిపే కార్యక్రమాన్ని వీక్షించడానికిక వీలుగా భారతదేశం అంతటా ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలను 2024 జనవరి 22 న మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇక పలు రాష్ట్రాలలో కూడా జనవరి 22 న సెలవు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో జనవరి 22న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయోధ్యలో శ్రీరామవిగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని.. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయం చేయకుండా అందరూ పాల్గొనాలని సూచించారు. శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నిధుల సమీకరణలో తెలంగాణ రాష్ట్రం రెండవ ప్లేసులో నిలవడం గర్వకారణమన్నారు. రాముడిని బీజేపీ పార్టీకి అపవాదించడం వివాదాస్పదం చేయడం సరికాదన్నారు.
ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా, ఆ రోజున రాష్ట్రాలన్నీ సెలవు ప్రకటించాయని తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం సెలవు ప్రకటించలేదని అన్నారు. దేశమంతా అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమ వేడుకలు చేసుకుంటుంటే, ఏపీ ప్రభుత్వ వైఖరి బాధాకరమని విష్ణుకుమార్ రాజు అన్నారు.