మంగళవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన సోషల్ మీడియా సంచలనం.. బాలుడు సహదేవ్ డిర్డో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. సహదేవ్ తన తండ్రితో కలిసి మోటార్‌సైకిల్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి తలకు బలమైన గాయమైంది. ప్రథమ చికిత్స అందించిన తర్వాత, సహదేవ్ డిర్డోను సుక్మా జిల్లా ఆసుపత్రి నుండి జగదల్‌పూర్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు. వైద్య కళాశాలలో చికిత్స ప్రారంభించే ముందు సుమారు 5 గంటలపాటు అపస్మారక స్థితిలో ఉన్నాడు. సహదేవ్ దిర్డో.. బచ్‌పన్ కా ప్యార్ పాటతో పాపులర్ అయిన విషయం తెలిసిందే.
మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో సహదేవ్ డిర్డో స్పృహలోకి వచ్చాడు. జగదల్‌పూర్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ టికు సిన్హా, సహదేవ్ ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని ధృవీకరించారు. బాలుడు ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాడని తెలిపారు. సీటీ స్కాన్ తదితర పరీక్షలు కూడా నిర్వహించారు. సహదేవ్ ప్రస్తుతం 12 గంటల పరిశీలనలో ఉన్నారు. ఇంతలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ శాసనసభ సభ్యుడు కవాసీ లఖ్మా సహదేవ్ డిర్డోకి ఉచిత చికిత్స కోసం ఏర్పాట్లు చేశారు.
కొన్ని సంవత్సరాల క్రితం, సహదేవ్ ఉపాధ్యాయుడు పాఠశాలలో పాట పాడమని అడిగాడు. అతని వీడియోను రికార్డ్ చేశాడు. ఆ క్లిప్‌ని ఆ తర్వాత ఇంటర్నెట్‌లో షేర్ చేశారు. అయితే ఈ వీడియో ఈ ఏడాది మాత్రమే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సహదేవ్ డిర్డోను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సత్కరించారు.